T Congress: ఢిల్లీకి మహేశ్ కుమార్ గౌడ్.. టీ కాంగ్రెస్ లో ఆసక్తిగా మారిన పీసీసీ చీఫ్ టూర్

by Prasad Jukanti |

టీ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది.

T Congress: ఢిల్లీకి మహేశ్ కుమార్ గౌడ్.. టీ కాంగ్రెస్ లో ఆసక్తిగా మారిన పీసీసీ చీఫ్ టూర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కుమార్ కూడా ఢిల్లీ బయలుదేరారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజు సందర్భంగా ఆయనను నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపనున్నారు. అయితే ఈ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్ (T Congress) లో ఆసక్తిగా మారింది. పైకి ఖర్గేను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకే అనే చర్చ జరుగుతున్నా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలతో మహేశ్ కుమార్ చర్చించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం, నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై కసరత్తు జరుగుతున్న వేళ పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. ఆర్డినెన్సు రూపంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపగా దానిని గవర్నర్ న్యాయసలహా కోసం పంపించారు. గవర్నర్ వద్ద ఏదైనా ఆటంకం ఏర్పడితే రాజకీయంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధం అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇటువంటి తరుణంలో పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ ఎవరెవరిని కలబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

Next Story