కాలుష్య నియంత్రణపై PCB ఫోకస్.. ఆరు కంపెనీలు మూసివేయాలని ఉత్తర్వులు

by Kema Shiva Kumar |

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ చట్టాలు, నియమాలను అమలుకు కట్టుదిట్టం చేసింది.

కాలుష్య నియంత్రణపై PCB ఫోకస్.. ఆరు కంపెనీలు మూసివేయాలని ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ చట్టాలు, నియమాలను అమలుకు కట్టుదిట్టం చేసింది. చట్టబద్ధమైన అధికారాలకు మరింత పదును పెట్టాలని నిర్ణయించింది. కాలుష్య తీవ్రత ఆధారంగాను, పీసీబీ నియమ నిబంధనలను పాటించని కంపెనీలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణలో ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించిన పరిశ్రమలు 12,264 ఉన్నాయి. కొత్త పరిశ్రమలకు అనుమతులివ్వడంతోపాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలు చట్టాలు, నిబంధనలను పాటిస్తున్నాయా? అంశాలను గుర్తించడానికి నిరంతరం పర్యవేక్షణలు, నోటీసులు జారీచేయడం పెనాల్టీలు వేయడంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి టీజీపీసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అయితే నవంబర్ మాసంలో నిర్వహించిన టాస్క్ కమిటీ సమావేశాల్లో 49 కంపెనీల పనితీరుపై సమీక్షించారు. వీటిలో నిబంధనలను పాటించని ఆరు కంపెనీలను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది.

ఆరు కంపెనీలపై వేటు..

టీజీపీసీబీ నుంచి సరైన అనుమతులు లేకపోవడంతోపాటు ఆపరేషన్స్ నిబంధనలు పాటించకపోవడంతో ఆరు కంపెనీలపై అధికారులు వేటేశారు. ఈ కంపెనీలను మూసేయాలని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పీసీబీ ఆర్డర్ జారీచేసిన కంపెనీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని శ్రీఉమాకాంత్ ఫ్యాబ్రిక్ డైయింగ్ యూనిట్, రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలంలోని నాగులపల్లి పరిధిలో ఉన్న స్వర్ణప్లాస్టిక్ యూనిట్‌ను మూసేయాలని నిర్ణయించారు. వీటితోపాటు సిద్దపేట జిల్లా ములుగు మండలంలోని బస్బాపూర్‌లో ఉన్న ఆశీర్వాద్ మెటల్ ఇండస్ట్రీస్, నల్గొండ జిల్లా దేవరకొండ, తూరుపుపల్లిలో ఉన్న శ్రీవెంగమాంబ మైనింగ్ కంపెనీ కంపెనీ, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని టీఈడబ్ల్యూ ఆటోమేషన్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ, యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పుల్ మండలం, ఎస్.లింగోటం పరిధిలో ఉన్న సహస్రా ఎన్విరో ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలను మూసేయాలని పీసీబీ ఉత్తర్వులు జారీచేసింది.

ఆన్‌లైన్ మానిటరింగ్ సెల్..

పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, కాలుష్య కారకాలను గుర్తించడానికి 24/7 ఆన్‌లైన్ మానిటరింగ్ సెల్ పకడ్భందీగా పనిచేస్తుందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం కోసం టీజీపీసీబీ టోల్-ఫ్రీ నంబర్ 10741, ఆన్‌లైన్ ఫిర్యాదు యాప్ ‘జనవాణి–కలుష్య నివారిణి’ని ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. పారిశ్రామిక ప్రాంతాలలో రాత్రి పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అనుమతుల్లేకుండా కంపెనీలు పనిచేస్తున్నా.. పీసీబీ నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని టీజీపీసీబీ బోర్డు హెచ్చరికలు జారీచేసింది.

Next Story