kaleshwaram commission: ప్రభుత్వం చేతికి ‘కాళేశ్వరం’ రిపోర్ట్.. రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ

by Prasad Jukanti |   (  Updated:2025-07-31 07:24:23  IST  )

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

kaleshwaram commission: ప్రభుత్వం చేతికి  ‘కాళేశ్వరం’ రిపోర్ట్.. రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో / డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని (Kaleshwaram project) మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తన తుది నివేదికను (PC Ghosh Commission final report) సమర్పించింది. ఈ మేరకు బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయానికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా రాగా ఆయనకు రెండు సీల్డ్ కవర్లలో కమిషన్ తన నివేదికను అందజేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రేవంత్ సర్కారు 2024, మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ దాదాపు 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళల్ ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు, మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ సహా మొత్తం 115 మందిని విచారణ చేసి వాంగ్మూలాలు నమోదు చేసింది. విచారణలోని అంశాలని క్రోడీకరించి తుది నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది.

నివేదికతో సచివాలయానికి..

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నివేదిక అందుకున్న అనంతరం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా (Rahul Bojja) మీడియాతో మాట్లాడారు. కమిషన్ నుంచి నివేదిక తీసుకున్నామని ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు అందజేస్తామని తెలిపారు. అనంతరం నివేదికతో ఆయన నేరుగా సచివాలయానికి బయలుదేరారు.

రిపోర్ట్‌లో ఏముంది?..

పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో నివేదికలో ఏమున్నదనేది దానిపై ప్రభుత్వ, రాజకీయ అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. కమిషన్ విచారణలో కాళేశ్వరం బ్యారేజీలలో లోపాలకు కారకులుగా ఎవరెవర్ని పేర్కొనబోతోంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ నిర్ణయాల మేరకు జరిగిందా లేదా? అనే విషయంపై కూడా కమిషన్ దృష్టి సారించి గత కేబినెట్ మీటింగ్ మినిట్స్‌ను పరిశీలించింది. అయితే విచారణ సందర్భంగా మెజార్టీ అధికారులు గత ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే మార్పులు, నిర్ణయాలు జరిగాయని కమిషన్‌కు వెల్లడించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కమిషన్ ఏయే అంశాలను పాయింట్ ఔట్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే నివేదిక అందడంతో ప్రభుత్వం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఉత్కంఠను రేపుతోంది.

Next Story