- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ నేలకు పాదాభివందనం: పవన్ కల్యాణ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణలో ఉద్భవించిన పార్టీ జనసేన. ఈరోజు విజయలక్ష్మి రూపంలో తొలి అడుగుపడింది. పార్టీ తొలినాళ్ళు గుర్తు చేసుసుకొంటే దారంతా గతుకులు.. భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న. చిన్నపాటి ఆసరా కూడా లేదు. మిణుకుమిణుకుమనే ఆశ. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన- వీర మహిళలు ఝాన్సీ లక్ష్మీభాయి స్ఫూర్తిని నింపుకొని.. ఉద్యమ స్ఫూర్తితో జనసైనికులు ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకొనేందుకు సంసిద్ధులయ్యారు. తెలంగాణలోని వీర మహిళలు, జనసైనికులు పురపాలక ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. 2998 స్థానాలున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనసేన 332 చోట్ల పోటీ చేసింది. ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేటర్ స్థానం జనసేనకు దక్కాయి.
మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే నేల పొరలను చీల్చుకొని మొలక వేస్తుంది. విశ్వ విజేత కూడా తల్లి గర్భంలో అణువంతే ఉంటాడు. కోటి రతనాల వీణ తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్‌లో అగ్గు సాగర్ జనసేన అభ్యర్ధులుగా సాధించిన విజయాలు భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన స్ఫూర్తిని అందిస్తాయి. విజయలక్ష్మి, సాగర్ లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. జనసేన తెలంగాణ వీర మహిళలు, జనసేన సైనికులు, నాయకులకు అభినందనలు. పార్టీ ఉద్భవించిన నేలపై దక్కిన తొలి విజయం ఇది. పోరాట పటిమను.. సంస్కృతి సంప్రదాయాల శక్తిని.. సాహితీ సౌరభాన్ని.. అణువణువునా నింపుకున్న తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక పాదాభివందనాలు’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.






