- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PAWAN KALYAN: తెలంగాణ మన్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్.. ఎవరికి లాభం?
మున్సిపల్ ఎన్నికల్లో రాంచందర్ రావు మద్దతు కోరగా పవన్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. మంగళవారం రాత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు పవన్ కళ్యాణ్ ను కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో రాంచందర్ రావు మద్దతు కోరగా పవన్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించారు. అయితే పొత్తుపై సోషల్ మీడియాలో జనసేన ఒకలా.. బీఏపీ మరోలా పోస్ట్ లు పెట్టడం ఆసక్తికరంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతుగా జనసేన పనిచేస్తుందని, పవన్ కళ్యాణ్ బీజేపీ తరుపున ఈ నెల 7,8 తేదీల్లో ప్రచారం చేస్తారని కాషాయపార్టీ పేర్కొంది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల తరుపున ప్రచారం చేస్తారని జనసేన పేర్కొంది.
ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల బరిలో దిగుతున్నట్టు జనసేన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే తమ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తారని జనసేన ఇంఛార్జీలను సైతం నియమించింది. టికెట్లు కోరేవారికి బీఫామ్ ఇస్తామని కష్టపడి పనిచేయాలని సైతం సూచించింది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు బీఫామ్ లు కూడా అందజేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ ఖరారు అయ్యింది. అంతేకాకుండా మొదట బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పింది. తెలంగాణలో జనసేనతో పొత్తు ఊహాజనితమైందని, అలాంటి వాటిపై స్పందించబోమని రాంచందర్ రావవు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని భావిస్తున్న నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేయాలన్నది తమ పార్టీ స్థానిక నాయకుల మనోగతం అని చెప్పారు. ఇక ఇప్పుడు హైకమాండ్ నుండి ఆర్డర్ వచ్చిందో ఏమో గానీ ఆయనే స్వయంగా పొత్తు కోసం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రభావమెంత?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆయన ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్నదానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. అంతే కాకుండా పవన్ పర్యటన జనసేనకు లాభం కలిగిస్తుందా? బీజేపీకి లాభం కలిగిస్తుందా అనేది కూడా ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో బీజేపీకి గతంతో పోలిస్తే క్యాడర్ ఉంది. పార్టీ కోసం కష్టపడే నాయకులతో పాటు కార్యకర్తలు ఉన్నారు. జనసేనకు పెద్దగా క్యాడర్ లేదనే చెప్పాలి. జిల్లాలు, నియోజకవర్గాల్లో సైతం చెప్పుకునేంతగా నాయకులు లేరు. ఏపీలో జనసేన ప్రస్తుతం బలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం యువతకు, మధ్య వయసువారికి తప్ప సీనియర్లకు, గ్రామీణప్రాంతాల్లో మహిళలకు పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. మరోవైపు గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ ఓటు షేర్ కూడా పెరిగింది.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పార్టీ మరింత బలంగా ఉంది. కాబట్టి ఈ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక పవన్ కల్యాణ్ పార్టీ విషయం పక్కన పెడితే సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారు. ఆయన మీటింగ్ పెడితే వేల మంది మీటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. అభిమానం ఓటుగా కన్వర్ట్ అవుతుందని చెప్పలేం కానీ కొద్దో గొప్పో బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఇక గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి మంచి రిజల్ట్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ కు పెద్దగా క్రెడిట్ దగ్గకపోగా బీజేపీ నాయకులు తమను పట్టించుకోవడం లేదని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సారి మున్సిపల్ ఎన్నికల కోసం పవన్ వస్తుండగా.. ఎలాంటి ప్రభావం చూపిస్తారు.. రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.






