జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు కోసం రూ.100 కోట్ల ప్లాన్

by Naga Rani Yarlagadda |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా ఖరీదుగా మారింది. ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదల అన్ని ప్రధాన పార్టీల్లో కనిపిస్తున్నది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు కోసం రూ.100 కోట్ల ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా ఖరీదుగా మారింది. ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదల అన్ని ప్రధాన పార్టీల్లో కనిపిస్తున్నది. అందుకే ఖర్చుకు వెనకాడటం లేదు. పోటీలు పడి మరీ డబ్బులు కుమ్మరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. నామినేషన్ దాఖలు నాటి నుంచి పోలింగ్ ముగిసేవరకు బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంట్ కోసం పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.3 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు టాక్.

ఒక్కో పార్టీ రూ.వంద కోట్ల ఖర్చు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు సగటున రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రిపేర్ అయినట్టు ప్రచారం జరుగుతున్నది. లీడర్లు, కేడర్ల ప్రచార ఖర్చులు, పార్టీల ప్రచార సభలు, రోడ్డు షోలు, ఆత్మీయ సమ్మేళనాలతో పాటు అత్యంత కీలకమైన పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక్కో పార్టీ రూ.100 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. ప్రచార ఆర్భాటంలో ఖర్చుకు ఏ పార్టీ వెనకాముందు ఆలోచించడం లేదు. పోటీలు పడి పెద్ద ఎత్తున డబ్బులు బయటకు తీస్తున్నాయి. ప్రచార కార్యక్రమానికి నగరంలోని ఇతర ప్రాంతాల నుంచీ జనాలను రప్పిస్తున్నారు. అందుకు ఒక్కొక్కరికి రూ.500 వరకు, మగవారికి అదనంగా లిక్కర్‌కు పైసలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

2 లక్షల మందికి నగదు?

నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం ఓట్లు సొంతం చేసుకున్న పార్టీకి గెలుపు ఈజీ అవుతుంది. దీనితో ప్రధాన పార్టీలు అన్నీ సుమారు 2 లక్షల మంది ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు‌ ప్లానింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఓ పార్టీ రూ.2వేలు ఇస్తే మరోపార్టీ అంతే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు టాక్. దీనితో మూడు పార్టీలు కలిపి ఒక్కో ఓటరుకు దాదాపు రూ.5 వేల వరకు నగదును ముట్టచెప్పే చాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది. ప్రధాన పార్టీలు ఇప్పటికే డబ్బులను నియోజకవర్గంలోకి డంప్ చేసినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా స్లమ్ ఏరియాల్లో ఉండే ఓటర్లకు సమాన స్థాయిలో నగదును ఇవ్వాలని, లేకపోతే విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని ఉద్దేశ్యంలో అన్ని పార్టీలు ఉన్నాయి.

నగదుతో పాటు లిక్కర్?

పోల్ మేనేజ్‌మెంట్‌లో నగదుతో పాటు లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్. పురుషులకు నగదుతో పాటు అదనంగా క్వార్టర్ లేదా ఆఫ్ బాటిల్‌ను పంపిణీ చేసేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం ఒక్కో పార్టీ సగటున రూ.15 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేసి నియోజకవర్గంలోని కేడర్ ఇండ్లలో భద్రపరిచినట్లు తెలుస్తున్నది. ప్రత్యర్థి పార్టీలు డంపులను గుర్తించకుండా రహస్య ప్రాంతాల్లో నగదు, మద్యాన్ని నిల్వ చేసినట్టు అన్ని పార్టీల కార్యకర్తల మధ్య చర్చ జరుగుతున్నది.

ఒకరోజు బూత్ ఖర్చు రూ.లక్షకుపైనే..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో బూత్‌కు ఒక్కో పార్టీ ఒక లీడరుకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి నుంచి ప్రచారం ముగిసేవరకు సదరు ఇన్‌చార్జీలు బూత్ పరిధిలో ఉన్న పార్టీ లీడర్లు, కేడర్ ప్రచారానికి వచ్చినందుకు భోజనాలు పెట్టించాలి. రోజు మందు పార్టీలు ఇవ్వాలి. అందుకోసం ప్రతి రోజూ ఒక్కో బూత్‌కు కనిష్టంగా రూ.10 వేల చొప్పున అన్ని పార్టీలు ఇస్తున్నాయి. అంటే పోలింగ్ ముగిసేవరకు ఒక్కో పోలింగ్ బూత్‌కు రూ.లక్ష చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనిష్టంగా పదిరోజుల కోసం అన్ని పార్టీలు బూత్ స్థాయి లీడర్ల ఖర్చుల కోసం రూ.20 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కలు తీసినట్లు తెలిసింది.

Next Story