- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అసెంబ్లీకి ‘పార్లమెంట్’ కళ: సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్లాన్!
తెలంగాణ అసెంబ్లీని భారత పార్లమెంట్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ ప్రాంగణం రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. దేశ రాజధానిలోని పార్లమెంట్ (Parliament) ప్రాంగణం తరహాలో రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాన్ని కూడా హుందాగా, అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ (Assembly) ప్రాంగణంలో సౌకర్యాలు, సభ్యుల ప్రైవసీ, భద్రతపై అధికారులతో సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ప్రాంగణం కేవలం కార్యాలయంగా కాకుండా, సభ గౌరవం ప్రతిబింబించేలా పార్లమెంట్ తరహాలో ఉండాలని స్పష్టం చేశారు. పబ్లిక్ గార్డెన్‌లో అసెంబ్లీ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఓ క్లబ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించి వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రైవసీకి పెద్దపీట..
శాసనసభ సభ్యులకు సభా ప్రాంగణంలో తగినంత ప్రైవసీ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇతరుల జోక్యం లేకుండా సభ్యులు తమ చర్చలు జరుపుకునే వాతావరణం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం డెడ్‌లైన్ విధించారు. అభివృద్ధి పనులు చేస్తున్న క్రమంలో చారిత్రక కట్టడాలకు, హెరిటేజ్ భవనాలకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి అనధికార వ్యక్తుల ప్రవేశం లేకుండా భద్రతను అత్యంత పటిష్టం చేయాలని, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.






