- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. గళమెత్తేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు రెడీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ సమస్యలపై తమ గళం వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఏయే అంశాలపై మాట్లాడాలో వారికి పార్టీ అధిష్టానం సూచనలు చేసింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోసం గళం విప్పే అవకాశాలున్నాయి. దీనితో పాటు రాష్ట్రానికి కొత్త రైల్వే మార్గాల ఆమోదాలు, పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్ చాలెంజ్ ఫండ్, రీజినల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రైల్, వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి విమానాశ్రయాలకు అనుమతులు వంటి సమస్యలను ప్రస్తావిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వెల్లడించారు. ఇక దేశంలో నెలకొన్న సమస్యలు పార్టీ పరంగా మాట్లాడే అంశాలపైనా ఎంపీలు మాట్లాడనున్నారు. ప్రధానంగా ఇటీవల ఓట్ చోరీపైన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఓటు చోరీ ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది. ఈ అంశంలోనూ ఎంపీలు మాట్లాడనున్నారు. దీంతో పాటు ఈసీ చేపడుతున్న ఓటర్ లిస్ట్‌ల ఎస్ఐఆర్‌లో లోపాలు, రాజకీయ జోక్యంతో జరుగుతున్న అవకతవకలు వంటి అంశాలను కాంగ్రెస్ సభలో ప్రస్తావించనున్నది. ఇటు బిల్లులపైనా రాష్ట్ర ఎంపీలు మాట్లాడే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్రానికి సబంధించినంత వరకూ బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్‌గా ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవగా, రెండో విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్
అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు తీసుకురావడం, 50 శాతం పరిమితి చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్, ఆ ఆర్డినెన్స్‌ను తిరిగి బిల్లుగా మార్చి అసెంబ్లీలో ఆమోదించడం వంటి కార్యక్రమాలు చేసింది. ఆ బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉండటం, 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను న్యాయస్థానాలు కొట్టివేయడంతో పాత రిజర్వేషన్ల పద్ధతిలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియపై రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో జీఓ 46ను తీసుకొచ్చి బీసీలను ప్రభుత్వం దగా చేసిందని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ తీసుకొని బీసీ రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం కలిగేలా వ్యవహరించాలని ఆ సంఘ నేతలు కోరుతున్నారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించేలా ఈ పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలని, ఈ సెషన్‌లోనే బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, మంత్రులు, ఎంపీలు ప్రయత్నించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు సొంత పార్టీ బీసీ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్లపై కేంద్రంలో కదలిక తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో బీసీ అంశంపైన ప్రభుత్వం, ఎంపీలు ఎలా వ్యవహరిస్తారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొన్నది. అయితే ఇటీవల ఎంపీలతో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చను తీసుకురావాలని, నిర్దేశిత ఫార్మాట్‌లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని, ప్రధాని మోడీని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, మోడీ సమయం ఇస్తే సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీకి వస్తారని తెలిపారు.
అధికారులు ఎంపీలకు సాయపడతారు
దీనితో పాటు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఎంపీలతో పార్లమెంటులో మాట్లాడే ప్రాధాన్యత అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఎంపీలకు అధికారులు 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీలో భట్టి అనేక సూచనలు ఎంపీల దృష్టికి తీసుకువచ్చారు. మన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో ప్రశ్నించడం, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలనుకునే సమాచారాన్ని తమకు ఇస్తే నిర్దేశిత ఫార్మాట్లో సమాచారాన్ని, వినతి పత్రాలను ఢిల్లీలోని రాష్ట్ర అధికారులు ఎంపీలకు అందించనున్నట్లుగా భట్టి విక్రమార్క ఎంపీలకు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు ఒక టీంగా ఏర్పడి రాష్ట్ర కోసం పాటుపడాలని సూచించారు. నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, జీఎస్టీలపైన కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలకు సంబంధించి గతంలో లేఖలు రాశామని, ఆ లేఖలు ఢిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపీలకు అందుబాటులో ఉంటాయని, వాటి ఆధారంగా ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుందన్నారు. కాగా ఎంపీలు తాము ప్రస్తావించదలుచుకున్న అంశాలను ఈ మీటింగ్‌లో చర్చించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన బీసీ రిజర్వేషన్ల అంశం, ఇటు రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల వంటి అంశాలను కాంగ్రెస్ ఎంపీలు సభలో ప్రస్తావించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.






