మట్టిని, మనిషిని చంపేస్తున్న గడ్డిమందు: లాభాల వేటలో బలైపోతున్న ప్రాణాలు

by Gantepaka Srikanth |

పంట పొలాల్లో కలుపు నివారణకు వాడే గడ్డిమందు పారాక్వాట్ రైతులు, రైతు కూలీలు, సామాన్యుల పాలిట విషంగా మారింది.

మట్టిని, మనిషిని చంపేస్తున్న గడ్డిమందు: లాభాల వేటలో బలైపోతున్న ప్రాణాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంట పొలాల్లో కలుపు నివారణకు వాడే గడ్డిమందు పారాక్వాట్ రైతులు, రైతు కూలీలు, సామాన్యుల పాలిట విషంగా మారింది. తక్కువ ఖర్చుకే మార్కెట్‌లో దొరికే రసాయనం శ్రమజీవుల ప్రాణాలను తీస్తున్నది. ఈ పురుగు మందు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు చికిత్స లేని మృత్యువుగా మారుతున్నది. నిత్యం ఎక్కడో ఒకచోట గడ్డి మందు తాగి రైతులు ఆత్మహత్యకు పాల్పడటం, యువత ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది. పారాక్వాట్ కేవలం రూ.200కే దొరుకుతున్నది. ఇది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. రక్తంలోని విషాన్ని ఫిల్టర్ చేసే క్రమంలో కిడ్నీలు కూడా పూర్తిగా దెబ్బతింటాయి. దీనికి ఇప్పటివరకు నిర్దిష్టమైన విరుగుడు అందుబాటులోకి రాలేదు.

మృతుల్లో యువత..

గాంధీ ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగం హెడ్ డాక్టర్ మంజుషా యడ్ల నేతృత్వంలో పదేళ్లుగా 400 కేసులపై అధ్యయనం చేశారు. దిగ్భ్రాంతి కలిగించే విషయాలను ఆమె వెల్లడించారు. బాధితుల్లో 73.7 శాతం మంది చికిత్స పొందుతూ చనిపోయారు. అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు. మరణిస్తున్న వారిలో సగటు వయస్సు 30ఏళ్లు కావడం, వీరంతా కుటుంబాల భారం మోసే వారే కావడం గమనార్హం. 90శాతం కేసులు ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఒత్తిడితో ఉద్దేశపూర్వకంగా ఈ విషం తీసుకున్నవేనని అధ్యయనం స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023లో 66 రకాల పురుగు మందులను నిషేధిస్తూ జారీచేసిన సర్క్యులర్‌లో పారాక్వాట్ పేరు ఉన్నప్పటికీ అందులో ఒక రసాయన రూపాన్ని మాత్రమే నిషేధించి, మరొకటి(పారాక్వాట్ సల్ఫేట్) వదిలేయడంతో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ లోనూ ఇది సులభంగా దొరకడంపై వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఎంఏ తెలంగాణ విభాగం త్వరలోనే ‘చలోఢిల్లీ’ పేరుతో జాతీయ స్థాయిలో నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

డాక్టర్ ఆందోళన..

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ కేసులపై హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం ప్రతినిధి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ బండారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. పారాక్వాట్ విషప్రయోగం ఇప్పుడు కేవలం వైద్యసమస్య మాత్రమే కాకుండా ఒక జాతీయ విధాన సమస్యగా మారిందని తెలిపారు. ఆస్పత్రుల్లో ముఖ్యంగా యువత, వ్యవసాయ కార్మికుల్లో ఈ కేసులు అధికంగా కనిపిస్తున్నాయని, స్పష్టమైన విరుగు లేకపోవడంతో ప్రాణాలు కాపాడటం క్లిష్టంగా మారుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎరువులు, పురుగు మందుల దుకాణాలు, ఆన్‌లైన్ వేదికల ద్వారా సులభంగా అందుబాటులో ఉండటం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పారాక్వాట్ వినియోగం, భద్రత, నియంత్రణపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి డాక్టర్లు, టాక్సికాలజీ నిపుణులు, వైద్యసంఘాలు, ప్రజాప్రతినిధులు, రైతు ప్రతినిధులతో కూడిన జాతీయ స్థాయి ఉన్నత కమిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఏర్పాటు చేయాలని హెచ్ ఆర్డీఏ డిమాండ్ చేస్తున్నది. మరింత ప్రాణనష్టం జరగకముందే విధానపరమైన మార్పులు తీసుకురావాలని, సామాజిక సంస్థలు కలిసి అవగాహన పెంచాలని కోరుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..

పారాక్వాట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై వ్యవసాయ అధికారుల ‘ప్రిస్క్రిప్షన్’ ఉంటేనే డీలర్లు ఈ మందును విక్రయించాలని వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కలుపు నివారణకు ఈ మందు అవసరమని భావిస్తే మండల వ్యవసాయ అధికారి లేదా ఏఈవో పొలాలను పరిశీలించి పర్మిషన్ ఇస్తారు. ఆ చీటీ ఆధారంగానే దుకాణదారులు మందును విక్రయించాలి.

Next Story