గుట్టల మధ్య గలగల.. చరిత్ర గుట్టు విప్పిన శాసనాలు

by Bhanu |

తెలంగాణ జియో హెరిటేజ్ ప్రదేశంగా గుర్తింపు పొందిన పాండవుల గుట్టలో మరో రెండు శాసనాలు వెలుగు చూసినట్టు ప్రముఖ ఔత్సాహిక

గుట్టల మధ్య గలగల.. చరిత్ర గుట్టు విప్పిన శాసనాలు
X

దిశ, మల్హర్ (భూపాలపల్లి): తెలంగాణ జియో హెరిటేజ్ ప్రదేశంగా గుర్తింపు పొందిన పాండవుల గుట్టలో మరో రెండు శాసనాలు వెలుగు చూసినట్టు ప్రముఖ ఔత్సాహిక పురావస్తు, చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు. "డిస్కవరీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ"గా పేరు పొందిన రత్నాకర్ రెడ్డి, మాటికె అనిరుధ్‌తో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టను సందర్శించారు.

ఈ సందర్శనలో గుహలోపల పై భాగంలో రెండు లఘు శాసనాలను గుర్తించినట్టు తెలిపారు. ఆయా శాసనాల చిత్రాలను తీసి, పురావస్తు శాఖ డైరెక్టర్ మరియు శాసన పరిశోధకుడు కె. ముని రత్నం రెడ్డికి పంపినట్టు వెల్లడించారు. ప్రాథమిక విశ్లేషణలో ఇవి 7వ శతాబ్దం నాటి తెలుగు-కన్నడ లిపిలో రాసిన శాసనాలుగా గుర్తించారు. అందులో ఒకదానిలో "శ్రీమతు..." అనే పదాలు స్పష్టంగా కనిపించగా, మరొకటి కొంతవరకు చెదిరిపోయిన స్థితిలో ఉంది.

ఈ పరిశోధన "పాండవుల గుట్ట ఫుట్‌ప్రింట్స్" పేరుతో సోషల్ మీడియాలో చరిత్రను సమకాలీన యువతకు చేరవేయాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న వీడియో సీరిస్‌లో భాగంగా జరిగింది. గతంలో 30 డేస్ చాలెంజ్ ఆఫ్ మై స్టోన్ ఏజ్ డిస్కవరీ, 30 డేస్ చాలెంజ్ ఆఫ్ మై విలేజ్ డిస్కవరీ, ముడుమాల టాక్స్, వేములవాడ డైరీ వంటి సీరీస్‌లకు ఇది కొనసాగింపు. రత్నాకర్ ఈ సీరిస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 30 రోజుల పాటు ప్రతి రోజూ ఒక రీల్‌గా పోస్ట్ చేయనున్నట్టు తెలిపారు.

పాండవుల గుట్టకు ఉన్న చారిత్రక ప్రాధాన్యం, పర్యాటక అవకాశాల దృష్ట్యా యునెస్కో జాబితాలో చేరే అర్హత ఉందని పేర్కొంటూ, టూరిజం శాఖ సహకారంతో ఈ ప్రదేశాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ప్రజల్లో చరిత్ర పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు కొనసాగించాలని రత్నాకర్ ఆకాంక్షించారు.


Next Story