- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ ఎన్నికల వేళ సిత్రాలు..! గెలుపు కోసం అభ్యర్థుల పాట్లు
గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు ఒక వైపు, నామినేషన్‌వేసిన వారిని బరిలో నుంచి తప్పించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫలానా అభ్యర్థి బరిలో ఉంటే తమ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని గుర్తించిన కొందరు.. ప్రత్యర్థి అభ్యర్థులను బరిలో నుంచి తప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకోసం బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. అప్పటికీ వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అభ్యర్థులను బరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బరిలో నిలిచిన అభ్యర్థి సామాజిక సమీకరణాలు, ఓట్లు విడిపోతే నష్టపోతామని ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెబుతూ తమ లక్ష్యాన్ని వివరిస్తున్నారు. తాము రాజకీయంగా, సామాజికవర్గాల వారీగా నష్టపోతామని, రాక రాక రిజర్వేషన్ ఇప్పుడే తమకు అనుకూలంగా వచ్చిందని, రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇది ఒక్కటే అవకాశమంటూ నామినేషన్‌వేసిన వారు విత్ డ్రా చేసుకోవాలని వేడుకుంటున్నారు.
ఏకగ్రీవానికి ప్రయత్నాలు..
గ్రామాల్లో ఏకగ్రీవం చేయడానికి అత్యధికులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం బేరసారాలు చేస్తున్నారు. పార్టీ నాయకుల ద్వారా ఇతర పదవులు ఇప్పిస్తామని, ఎమ్మల్యేల ద్వారా, ఇతర నాయకుల ద్వారా బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని సామరస్యపూర్వకంగా విన్నవించుకుంటున్నారు. వినకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. కేసులు, భూ వివాదాలు, ఆస్తుల వివాదాలను తెరముందుకు తీసుకువస్తున్నారని సమాచారం. ఆర్థిక కార్యకలాపాల ద్వారానే ఎక్కువ మందిని లొంగదీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. ఇలా తాము సర్పంచ్‌గా ఎన్నిక కావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో నామినేషన్‌వేసిన సర్పంచ్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉంటున్నట్లు సమాచారం. నామినేషన్‌ల ఉపసంహరణ వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తమ పార్టీకి చెందిన వారు ఎన్నికయ్యే విధంగా శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
భవిష్యత్తులో అవకాశాలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపునకు పనిచేసే వారిని గెలిపించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో జనాభా ఎక్కువగా ఉండే గ్రామాల్లో తమ అనుచరుడు ఎన్నిక కావడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయానికి కష్టించి పనిచేస్తారని ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన నియోజకవర్గ, మండల ముఖ్య నాయకులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే అధికార పార్టీలో రాబోయే రోజుల్లో నామినేటెడ్పదవులు, ఎంపీటీసీ, పీఏసీఎస్, మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీల్లో అవకాశాలు ఇస్తామంటూ ప్రత్యర్థి అభ్యర్థులకు నచ్చజెపుతున్నారు. వారిని బుజ్జిగించి తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.






