SLBC Incident : బీఆర్ఎస్ నాయకులది ఓవరాక్షన్‌ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Muthe.Rajitha |

ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనాస్థలాన్ని(SLBC Tunnel Incident) హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం గురువారం పరిశీలించిన విషయం తెలిసిందే.

SLBC Incident : బీఆర్ఎస్ నాయకులది ఓవరాక్షన్‌ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ / అచ్చంపేట : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనాస్థలాన్ని(SLBC Tunnel Incident) హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం గురువారం పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరవ రోజు ఎస్ఎల్బీసీ జేపీ ఇంజనీరింగ్ కార్యాలయం బయట ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై మీడియా పాయింట్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఎస్ఎల్బీసీ వద్ద ప్రకృతి విపత్తు జరగడానికి కారణం ముమ్మాటికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మండిపడ్డారు. ఘటనకు ప్రధాన కారణం గడిచిన 10 ఏళ్లలో సరైన నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని వారి చౌకబారు మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఘాటుగా విమర్శించారు. హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని మంత్రి కొట్టి పారేశారు.

ప్లాస్మా కట్టర్ ద్వారా టీబీటీ మిషన్ భాగాలు తొలగింపు..

ఎస్ఎల్బిసి సొరంగంలో పైనుండి మట్టి దెబ్బలు కూలి ప్రమాద ఘటన జరిగిన ప్రదేశానికి ఎన్డిఆర్ఎఫ్ తో పాటు మరో 10 ఇతర బృందాలు సమన్వయం చేస్తూ మరింత ముందుకు వెళుతున్నారని, అలాగే టిబిటి మిషన్ కట్ చేసి వాటిని తొలగించే ప్రయత్నంలో దేశంలో అత్యాధునికమైన ప్లాస్మా కట్టర్ ద్వారా కట్ చేసే చర్యలు మొదలయ్యాయన్నారు.

మరో మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి..

ఎస్ఎల్బిసిలో నెలకొన్న ఘటనపై రిస్క్యూ ఆపరేషన్ మూడు రోజులలో పూర్తయ్యే అవకాశం ఉందని, అలాగే తిరిగి మూడు నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగ పనులు పురం ప్రారంభం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రతిపక్ష నాయకులు సోయలేని అర్ధరాత్రి మాటలు మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.

గత ఈ ప్రభుత్వానికి భిన్నమైన తేడాలు..

గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా తేడాలు ఉన్నాయని గడిచిన పదేళ్లపాటు పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం SLBC ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, వారి పాలనలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నేడు ఈ ప్రకృతి విపత్తు జరిగేది కాదన్నారు. కేవలం 9 కిలోమీటర్లు పూర్తి చేసి ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి 30 టిఎంసిల కృష్ణా జలాలు గ్రావిటీ ద్వారా వచ్చి సుమారు 5 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందేదని గుర్తు చేశారు.

హరీష్ రావుకు సిగ్గుండాలి..

గత ప్రభుత్వం లో కెసిఆర్, హరీష్ లు ఇద్దరు కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా వినాశనం చేశారని కేవలం వాళ్ళు జేబులో నింపుకున్నారని మంత్రి ఆరోపించారు. ఆనాడు కాలేశ్వరం ప్రాజెక్టు జరిగిన ప్రమాదంపై శ్రీధర్ బాబు వెళితే అడ్డుకున్నది గత ప్రభుత్వమే అన్నారు. అలాగే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు పవర్ హౌస్ లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతి చెందితే పరామర్శించనివ్వలేదని, దేవాదుల ప్రాజెక్టులో ఏడు మంది చనిపోతే వారి అస్తికలు మాత్రమే బయటికి వచ్చాయని, కాలేశ్వరం ప్రాజెక్టులో 6 మంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఆరు మంది చనిపోతే వాటికి మీ ప్రభుత్వంలో జవాబులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు ప్రమాదంలో 64 మంది చనిపోతే మీ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు కనీసం పరామర్శ చేయలేదని విమర్శిస్తూ.. కనీసం హరీష్ రావుకు సిగ్గుండాలి అని ఎద్దేవా చేశారు. గతంలో ఇదే ఎస్ఎల్బీసీలో విద్యుత్తు సరఫరా ఇవ్వలేకపోయిన జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. NDRF ఇతర బృందాలు చేస్తున్న కృషిని హరీష్ రావు విమర్శించి మాట్లాడడం తగదన్నారు. నాకు హెలిక్యాప్టర్లో తిరిగే సోకు ఏం లేదని నేను పైలెట్ ను.. సీఎం రేవంత్ రెడ్డి సూచన సలహాలు మేరకు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో నిరంతరాయంగా ఉంటూ సమీక్షల సమావేశాలు చేస్తూ దేశంలోనే అత్యున్నత నిపుణులతో చర్చలు జరుపుతూ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు ప్రభుత్వం మంత్రులు పని చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు, స్థానిక నాయకులు ఉన్నారు.

Next Story