ఉపాధి హామీలో భారీ మార్పులు.. 7 లక్షల జాబ్ కార్డులు కట్!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-20 02:16:43  IST  )

కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఏడు లక్షల కార్డుల్లో కోత విధించింది.

ఉపాధి హామీలో భారీ మార్పులు.. 7 లక్షల జాబ్ కార్డులు కట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉపాధి హామీ పథకం ఉద్దేశ్యం, లక్ష్యాన్ని మార్చి కొత్త పేరును తీసుకువచ్చింది. గతంలోనే కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో జాబ్ కార్డులు, లక్షల సంఖ్యలో కుటుంబసభ్యులను పేర్లను అధికారులు జాబితా నుంచి తీసివేస్తున్నారు. కఠిన నిబంధనలు, తక్కువ వేతనాలు, పనులకు వెళ్లినా గిట్టుబాటు కాకపోవడం, గ్రామాలు పట్టణాలుగా మారుతుండడంతో లక్షలాది జాబ్ కార్డులు రద్దవుతున్నాయి. ఆరేండ్ల (2019-20 నుంచి 2024-25) వ్యవధిలో తెలంగాణలో ఏకంగా ఏడు లక్షలకు పైగా జాబ్ కార్డులతోపాటు 22.28 లక్షల మంది కూలీల పేర్లను జాబితా నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తొలగించడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 5.10 లక్షల కార్డులను తొలగించారు. గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో కార్డులను తొలగించలేదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.

సగం మంది సభ్యులే యాక్టివ్

రాష్ట్రంలో ప్రస్తుతం 52.22 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.07కోట్ల మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. అయితే 30.59 లక్షల జాబ్ కార్డుదారుల్లోని 49.99 లక్షల మంది సభ్యులు మాత్రమే యాక్టివ్గా ఉన్నారని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. కఠిన నిబంధనలకు తోడు ఆసక్తి లేక కొందరు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కఠిన నిబంధనలు, షరతులతోపాటు తక్కువ వేతనాలు వస్తుండడంతో ఉపాధి హామీ పనుల కంటే వేరే పనులకు వెళ్లడం లాభమనే ఉద్దేశంతో చాలా మంది జాబ్ కార్డులను ఉపయోగించడం లేదని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఉదయం ఒకసారి, మధ్యాహ్న భోజనం తర్వాత మరోసారి పని ప్రదేశంలో కచ్చితంగా ఫొటో తీయాలనే నిబంధన ఉపాధి పనులకు కూలీలను దూరం చేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా బయట పెరుగుతున్న కూలీ రేట్లకు అనుగుణంగా ఉపాధి హామీలో కూలీ రేట్లు పెరగకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. వీటికి తోడు గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు, కూలీలు చనిపోవడం, గ్రామాలు పట్టణాలుగా మారడం, సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం కావడం వల్ల కూడా జాబ్ కార్డుల సంఖ్య తగ్గుతూ వస్తున్నదని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ఇన్ని నిబంధనలతో ఉపాధి పనులు చేయడం అవసరమా అనే కోణంలో కూలీలు ఆలోచిస్తూ పనికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ జాబ్ కార్డుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఫలితంగా పథకం లక్ష్యం క్రమక్రమంగా నీరుగారుతున్నది. అయితే కేంద్రం పరోక్ష లక్ష్యం మాత్రం నెరవేరుతున్నదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

Next Story