జీహెచ్ఎంసీలో 300పైగా వార్డులు!

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ మహానగరం విస్తరణ, విభజన అంశాలపై ఓవైపు మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ.. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు సీనియస్‌గా కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం, వార్డుల పునర్విభజన అంశాలపై జీహెచ్ఎంసీ

జీహెచ్ఎంసీలో 300పైగా వార్డులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మహానగరం విస్తరణ, విభజన అంశాలపై ఓవైపు మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ.. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు సీనియస్‌గా కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం, వార్డుల పునర్విభజన అంశాలపై జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు మూడు రోజులుగా వర్కౌట్ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఓటర్ల ప్రాతిపదికనగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వార్డుల సరిహద్దులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు అధికారులు చెబుతున్నారు.

ఏరియా చ.కి.మీ ఓటర్లు జనాభా అంచనా

జీహెచ్ఎంసీ 650 98,74,600 1,45,15,662

కంటోన్మెంట్ 40.17 2,53,636 3,72,844

27యూఎల్బీస్ 1317.73 13,72,094 20,16,978

మొత్తం 2007.9 1,15,00,330 1,69,05,485

30 వేల ఓటర్లు..

జీహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డుల్లో ఒక్కో వార్డులో ఒక్కోవిధంగా జనాభా ఉంది. 2011 తర్వాత కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను తీసుకోలేదు. అంతేకాదు అంచనా జనాభాను పరిగణనలోకి తీసుకోవడంతో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశముందని గుర్తించిన అధికారులు ఓటర్లను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఒక్కో వార్డులో 30 వేల నుంచి 40 వేల మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇలా చేస్తే జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న 150 వార్డులు సుమారు 265 వార్డులకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటికే కాప్రా సర్కిల్ 6 వార్డుల నుంచి 12 వార్డులకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. సరూర్ నగర్ 5 నుంచి 7, ఉప్పల్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, చందానగర్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్ సర్కిళ్ల పరిధిని విస్తరించే అవకాశమున్న నేపథ్యంలో వార్డులు కూడా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

27 యూఎల్బీల్లో 35వార్డులు..

జీహెచ్ఎంసీలో విలీనం చేసిన 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లోనూ వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కోదాన్ని 2 వార్డులుగా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఒక్క జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మాత్రమే ఒక వార్డుగా గుర్తించాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటిని 13 వార్డులుగా చేసే అవకాశముంది. 20 మున్సిపాలిటీల్లో పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీని మాత్రమే 3 వార్డులు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే మొత్తం 22 వార్డులు అయ్యే అవకాశముంది. 27 పట్టణ స్థానిక సంస్థలను మొత్తం 35 వార్డులుగా విభజించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

సరిహద్దులపై ఫోకస్..

జీహెచ్ఎంసీలో 150 వార్డులకు సంబంధించిన సరిహద్దులను ఇష్టారాజ్యంగా చేశారనే విమర్శలున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వార్డులను ముక్కలు.. ముక్కలు చేసిందని ఆరోపణలు లేకపోలేదు. ఈసారి జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని తెలిసింది. వార్డుల పునర్విభజనతో పాటు సరిహద్దుల గుర్తింపు కూడా కీలకమేనని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. రోడ్డును ప్రామాణికంగా తీసుకుని రోడ్డుకు ఎడమవైపు, రోడ్డుకు కుడివైపు వార్డు సరిహద్దులను గుర్తించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

రహస్యంగా..

జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశాన్ని అధికారులు రహస్యంగా ఉంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు జోనల్, సర్కిల్ స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులంతా 3 రోజులుగా కసరత్తు చేస్తున్నారు. మొదటిరోజు గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), రెండు రోజులుగా ఎంసీహెచ్ఆర్డీ సెంటర్‌లో కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. వార్డుల విభజన రాజకీయాలపై ప్రభావం చూపుతుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సమాచారాన్ని బయటికు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా సమాచారాన్ని బయటికు ఇచ్చినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించినట్టు తెలిసింది.

300పైగా వార్డులు..

జీహెచ్ఎంసీతో పాటు విలీనం చేసిన 27 మున్సిపాలిటీలతో కలిపి హైదరాబాద్ మహానగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటు జీహెచ్ఎంసీ, 27 మున్సిపాలిటీల పరిధిలో వార్డులను పునర్విభజన చేస్తే వార్డుల సంఖ్య 300 దాటే అవకాశముందని అధికారులు గుర్తించారు. ఈ మహా నగరాన్ని ఎన్నికలకు ముందు మూడు భాగాలుగా విభజించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Next Story