మళ్లీ మొదటికే.. 2 లక్షలకు పైగా ధరణి అప్లికేషన్లు వెనక్కి

by Ajay Maddhiboyina |

భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నా.. అధికారులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు.

మళ్లీ మొదటికే.. 2 లక్షలకు పైగా ధరణి అప్లికేషన్లు వెనక్కి
X

దిశ, తెలంగాణ బ్యూరో : భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నా.. అధికారులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. రెండు, మూడేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తులను పరిష్కరించడం మానేసి.. వాటిని మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాలంటూ తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ధరణి పోర్టల్ అమలులో ఉన్నప్పటి నుంచి పెండింగులో ఉన్న సుమారు 2 లక్షల వరకు ఫైళ్లు సీసీఎల్ఏ నుంచి కిందిస్థాయి వరకు చేరాయి. దీంతో జీపీవోలు పాత దరఖాస్తులను పట్టుకొని రైతుల ఇళ్లకు వెళ్తున్నారు. ‘అయ్యో.. సర్! ఎప్పుడో రిపోర్ట్ పంపారు కదా’ అని రైతులు చెప్పినా వినిపించుకోవడం లేదు. మళ్లీ మొదటి నుంచి చేయాలని ఆదేశాలు వచ్చాయని జీపీవోలు అంటున్నారు. దీంతో భూ సమస్యల పరిష్కారానికి ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పటి రిపోర్టులు చెల్లవా?..

గతంలో ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు అధికారాలన్నీ కేంద్రీకృతం చేశారు. పేరులో చిన్న తప్పు దొర్లినా ఫైలు సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సిందే. అప్పట్లో రైతులు ఆర్ఐ, డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ చుట్టూ తిరిగితే గానీ ఆ ఫైళ్లు సీసీఎల్ఏ వరకు చేరలేదు. కానీ ధరణి పోర్టల్‌లో అప్లయ్ చేసినవాటిని పరిష్కరించకుండా ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెట్టారు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చాక అధికార వికేంద్రీకరణ చేశారు. ‘భూ భారతిలో అధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టాం.. అందుకే వాటిని చేయాల్సిన బాధ్యత వాళ్లదే’ అంటూ సుమారు రెండు లక్షల దాకా అప్లికేషన్లను రిటర్న్ పంపారు. అధికార వికేంద్రీకరణ చేసినా.. చేయకపోయినా రిపోర్ట్ మాత్రం తహశీల్దార్ నుంచే కదా వచ్చింది. వాటి ఆధారంగా కలెక్టర్లు ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాలి. కానీ మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాలంటూ మండలాలకు పంపడం వెనుక ఉద్దేశ్యమేమిటో అర్థం కావడం లేదని కొందరు రెవెన్యూ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొదట పంపిన రిపోర్ట్ వెనుక దరఖాస్తుదారుడి శ్రమ, ఖర్చు ఎంత ఉన్నదో ఎంక్వయిరీ చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తుందంటున్నారు. అప్పుడు తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ పంపిన రిపోర్టులు ఎందుకు చెల్లవో మాత్రం ఉన్నతాధికారులు చెప్పడం లేదు.

అండర్ వెరిఫికేషన్..

ధరణి పోర్టల్ అమలు కాలంలో సుమారు రెండు లక్షల అప్లికేషన్లు పెండింగులో ఉన్నట్లు సమాచారం. వాటిలో తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ల నుంచి రిపోర్టులు వచ్చినవే అధికం. సర్వే నంబర్ మిస్సింగ్, విస్తీర్ణం తక్కువగా నమోదు, పేరు తప్పు, పట్టా భూమి నోషనల్ ఖాతాలో రాయడం వంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటూ వేల అప్లికేషన్లను పక్కనపెట్టారు. కానీ సర్వే నంబర్‌లో విస్తీర్ణం ఎందుకు పెరిగిందో, ఎవరు అక్రమంగా రాయించుకున్నారో, ఎవరి ఖాతాలో అమ్మేసినా డిలీట్ చేయకుండా ఉన్నదో గుర్తించాల్సిన బాధ్యత అధికారులదే. కానీ వాటిని తిరిగి ఎంక్వయిరీ చేయాలంటూ మండలాలకు పంపారు. ఇందులో పట్టా భూమిని అసైన్డ్‌గా రాశారని, సరి చేయాలంటూ పెట్టుకున్న అప్లికేషన్లు కూడా ఉన్నాయి. తహశీల్దార్లు, ఆర్డీవోలు రికమండ్ చేస్తూ ఫైల్ అదనపు కలెక్టర్లు, కలెక్టర్లకు పంపినా వాళ్లు వాటిని పరిశీలించడం లేదు. రెండేండ్ల క్రితం రికమండ్ చేస్తూ పంపిన ఫైళ్లపైనా అండర్ వెరిఫికేషన్ అనే చూపిస్తుండడం గమనార్హం. ఈ సమస్య రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, హన్మకొండ జిల్లాల్లోనే అధికంగా ఉంది.

మూడున్నరేండ్ల తర్వాత..

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో నిదురం చంద్రమ్మ (అప్లికేషన్ నం.2200061840) రెవెన్యూ రికార్డుల్లో తన భర్త పేరు సవరణ కోసం 2022 జులైలో దరఖాస్తు చేసుకున్నారు. భర్త పేరు చెన్నరాయుడు కాగా, రికార్డుల్లో చెన్నయ్య ఉన్నదని, దాన్ని సవరించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం సేల్ డీడ్, ఆధార్, పాన్ కార్డు అన్నీ సమర్పించారు. తహశీల్దార్, ఆర్డీవో రికమండ్ చేసి, కలెక్టరేట్‌కు పంపి రెండేళ్లు గడిచింది. ఇప్పటికీ అండర్ వెరిఫికేషన్ అనే చూపిస్తున్నది. అలాగే 2200079641, 2200061810లు కూడా అండర్ వెరిఫికేషన్‌గానే ఉంచారు. 2200054925 అప్లికేషన్ రెండేండ్ల తర్వాత డేటా ఎంట్రీకి ప్రొసీడ్ అన్నారు. 2008లో కొనుగోలు చేసినట్లుగా సేల్ డీడ్, అందులోని పేర్లను పరిశీలించారు. ఈసీ, కొత్త ఆర్వోఆర్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్.. అన్నీ చూస్తే.. అన్నింట్లో కరెక్టుగానే ఉన్నది. ధరణి రికార్డుల్లోనే తప్పుగా నమోదు చేశారు. ఇదేమీ చెన్నమ్మ చేసిన తప్పు కాదు. పక్కాగా రెవెన్యూ అధికారులు చేసిందే. కానీ అధికారులు చేసిన తప్పును రుజువు చేయడానికి దరఖాస్తుదారులే అన్ని ఆధారాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ రికమండ్ చేశారు. ఆర్డీవో కూడా రికమండెడ్ అని రాసి సంతకాలు చేసి కలెక్టరేట్‌కి పంపి రెండేండ్లవుతుంది. కానీ అదనపు కలెక్టర్ చూడరు. కలెక్టర్లకు తీరిక లేదు. ఇది కూడా రెవెన్యూ రికార్డులు రాసిన ఉద్యోగులు చేసిన తప్పే. అయినా నేటికీ పెండింగులోనే ఉండడం గమనార్హం. ఇటీవల సీసీఎల్ఏ నుంచి ఈ అప్లికేషన్ కూడా తిరిగొచ్చింది. ఇప్పుడా వృద్ధురాలు మంచాన పడి ఉంది. కనీసం వేలిముద్రలు వేసే పరిస్థితుల్లో కూడా లేదు. ఇప్పుడు మళ్లీ జీపీవో ఎంక్వయిరీ చేస్తుండడం గమనార్హం.

ఫిజికల్ కాపీ కోసం..

నల్లగొండ జిల్లాలో రెండు కుటుంబాలకు ల్యాండ్ ఉంది. అయితే వాళ్లంతా ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో సెటిలయ్యారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వాళ్లు ఊరికి రాలేదు. దాంతో నోషనల్ ఖాతాలో రాశారు. వీరిలో ఇద్దరు తమది పట్టా భూమి అంటూ అప్లయ్ చేశారు. ఒకరిదేమో పట్టాగా మార్చారు. వాళ్లు కొంత భూమి కూడా అమ్మేసుకున్నారు. రెండో దరఖాస్తుదారుడి ఫైల్ నేటికీ పెండింగులోనే ఉంచారు. మూడేండ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు. తహశీల్దార్, ఆర్డీవోలు అది పట్టా ల్యాండ్ అని డిక్లేర్ చేస్తూ రిపోర్ట్ కూడా ఇచ్చారు. అయితే తహశీల్దార్ ఈ రిపోర్ట్ ఫిజికల్ కాపీని కలెక్టరేట్‌లో అందించలేదంటూ తిరస్కరించారు. అంతా ఆన్‌లైన్ చేశాకా.. ఫిజికల్ కాపీ ఇవ్వలేదని రిజెక్ట్ చేసిన రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు భూ భారతి చట్టం పక్కాగా ఎలా అమలవుతుందన్న సందేహం కలుగుతున్నది.

Next Story