అవుట్ సోర్సింగ్‌లో ‘అధికార’ దోపిడీ.. ఆఫీసర్లే దొంగలు

by Naga Rani Yarlagadda |

ఆఫీసర్లే ఎంప్లాయీస్ పేరుతో.. ఒకటికి రెండు జీతాలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఏడువేల మంది ఆఫీసర్లు ఈ స్కామ్ లో ఉండటం గమనార్హం.

అవుట్ సోర్సింగ్‌లో ‘అధికార’ దోపిడీ.. ఆఫీసర్లే దొంగలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘అవుట్ సోర్సింగ్’ స్కాంలో అసలైన దొంగలను ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 7 వేల మంది ఆఫీసర్లే ‘ఎంప్లాయీస్’ పేర్లతో జీతాలను కొల్లగొట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఆ సొమ్ము తీసుకుంటున్న అధికారుల వివరాలు మొత్తం ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. సదరు అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

ఫోరెన్సిక్ ఆడిట్‌తో గుట్టురట్టు

గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నియామకాలు ఇష్టానుసారంగా చేపట్టడంతోనే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. కొన్ని శాఖల్లో అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు రెండు, మూడు ఆఫీసుల్లో జీతాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సంస్థల్లో జీతాలు డ్రా చేస్తున్నారు కానీ, సిబ్బంది మాత్రం పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోగస్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌ను గుర్తించి ఏరివేయాలని రిటైర్డ్ ఐఏఎస్ శాంతికుమారి నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఆ కమిటీ రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డిటేయిల్స్ ఆర్థిక శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, అప్పుడే జీతాలు రిలీజ్ చేస్తామని కండీషన్ పెట్టింది. దీంతో వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీలు తమ వద్ద పని చేస్తున్న ఎంప్లాయీస్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాయి. కాగా, ముందుగా శాశ్వత ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ‘360 డిగ్రీస్’లో (ఫోరెన్సిక్ ఆడిట్) వడపోశారు. దీంతో సుమారు 7 వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో జీతాలు తీసుకున్న విషయం వెల్లడైనట్లు తెలిసింది.

ఒకరికే రెండు జీతాలు

ఈ 7 వేల మంది ఎంప్లాయీస్ ప్రతి నెలా రెగ్యులర్ శాలరీ తీసుకుంటూనే, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో మరో జీతం తీసుకుంటున్నారని గుర్తించినట్లు తెలిసింది. కొందరు ఒకే బ్యాంక్ అకౌంట్‌లో రెండు రకాల జీతాలు తీసుకోగా, మరికొందరు వేర్వేరు బ్యాంక్ అకౌంట్‌లలో జీతాలు పొందినట్లు తెలుస్తున్నది. ఆ జాబితాలో మెజార్టీ మంది ఉన్నత స్థాయి అధికారులే ఉన్నట్లు సమాచారం. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సేవలు అందించే ఎజెన్సీలతో కుమ్మక్కై అధికారులు అక్రమాలకు పాల్పడగా.. ఆఫీసర్లు కావడంతో ఎజెన్సీలు సైతం మౌనంగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమాలు ఎక్కువగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే సంస్థలు, కార్పొరేషన్లు, వర్సీటీలు, ఇతర సంస్థల్లో ఉన్నట్లు గుర్తించారు. వీరందరిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇంతకాలం అక్రమంగా తీసుకున్న జీతాన్ని వెనక్కి తీసుకోవాలా? లేకపోతే కేసులు నమోదు చేయాలా? అనే అంశంపై సీఎంఓ అధికారులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

25 వేల మంది వివరాలు ఇవ్వలే..

రాష్ట్రంలో సుమారు 4.90 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ డిటేయిల్స్ ఇవ్వాలని కండీషన్ పెట్టడంతో బినామీలు అలర్ట్ అయ్యారు. ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో ప్రభుత్వం విధించిన గడువులోపు దాదాపు 4.65 లక్షల మంది వివరాలు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో 25 వేల మంది బినామీలు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ‘పోర్టల్‌‌లో వివరాలు అప్‌లోడ్ చేస్తే దొరికిపోతామనే భయంతో అప్పటివరకు జీతాలు తీసుకున్న వ్యక్తులు తమ డిటేయిల్స్‌ను ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా పనిచేసే వ్యక్తులైతే వివరాలు ఇచ్చేవారు కదా? జీతాన్ని ఎందుకు వదలుకుంటారు?’ అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

Next Story