అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చిన్నచూపు.. ప్రోత్సాహకాల విడుదల్లో జాప్యం

by Naga Rani Yarlagadda |

కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులు తమకు ఇచ్చే ప్రోత్సహకాల డబ్బుల కోసం 8 నెలలుగా ఎదురుచూస్తున్నారు.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చిన్నచూపు.. ప్రోత్సాహకాల విడుదల్లో జాప్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులు తమకు ఇచ్చే ప్రోత్సహకాల డబ్బుల కోసం 8 నెలలుగా ఎదురుచూస్తున్నారు. చిన్న ఉద్యోగులుగా చిన్న జీతంతో బతికే తమకు ఇలాంటి ప్రోత్సహకాలకు సంబంధించిన మొత్తాన్ని విడుదల చేస్తే కుటుంబ అవసరాలు తీరుతాయనే అంచనాతో ఉన్నామని అయితే ఎక్కడా కూడా సానుభూతి వ్యక్తం కావడంలేదంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పరధిలో రాష్ట్రంలో పనిచేస్తున్న వారికి ఓటరు జాబితా సవరణ సమయంలో, ఎన్నికల సమయంలో ప్రత్యేక అలవెన్సు ఇస్తుంటారు. దీనిని రెగ్యులర్​ ఉద్యోగులకు, అవుట్​ సోర్సింగ్​ విధానంలో పనిచేసే ఉద్యోగులకు వర్తింపు చేస్తుంటారు. ఇది గత కొన్ని యేండ్ల నుంచి అమలవుతుంది. అయితే కోట్లల్లో బిల్లులు ఎన్నికల సంఘానికి సంబంధించి విడుదల అవుతున్నా.. చిన్నపాటి మొత్తం మాత్రం విడుదల కావడంలేదని అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ​సమ్మరి రివిజన్​ (ఎస్​ఎస్​ఆర్​ 2025)కు సంబంధించిన మొత్తం, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్​, టీచర్స్​ ఎన్నికలకు సంబంధించిన కన్వీయెన్స్​ విడుదల కావాల్సి ఉంది. ఇలా మొత్తం రూ.46 లక్షలు రావాల్సి ఉందని వారు చెబుతున్నారు. గత జనవరి నుంచి ఈ మొత్తం విడుదల కావాల్సి ఉందని, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు తక్కువ మొత్తంలో వేతనం ఉంటుందని, ఇలాంటివి తమ కుటుంబ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతాయని ఎదురుచూస్తుంటే రేపు మాపు అంటూ వాయిదా పడుతుందని చెబుతున్నారు. కోట్లకు సంబంధించిన బిల్లులు కూడా ఎన్నికల సంఘానికి విడుదల అవుతున్నాయని, తమకు సంబంధించిన మొత్తమే విడుదల కాకుండా మిగిలి పోయిందని చెబుతున్నారు. గత జనవరిలో టోకేన్​ నెంబర్​ కూడా అలాట్​ అయిందని, అప్పట్లో నిధులు కోరత, ఆర్థిక సంవత్సరం చివర కావడంతో ఇతర బిల్లులను అన్నింటిని వెనక్కి పంపించారని, కొత్త ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని చెప్పారని, కానీ ఇంత వరకు నిధులు విడుదల కాలేదని వారంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త టోకెన్​ నెంబర్​ కూడా అలాట్​ చేశారు. ఇలా అయి కూడా ఆరు నెలలు అయినా డబ్బులు మాత్రం విడుదల కావడంలేదని, తమ గోడును ఏవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఉద్యోగుల కావడంతో ఎవరినీ గట్టిగా అడగలేని పరిస్థితి ఉందని, గట్టిగా అడిగితే ఎక్కడ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే బాధతో అడగటంలేదని వారు చెబుతున్నారు. పదుల సంఖ్యలో అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. వెంటనే నిధులు విడుదల అయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు.

Next Story