మాది గుడ్ గవర్నెన్స్ కాదు.. స్మార్ట్ గవర్నెన్స్: మండలిలో సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు క్యూర్, ప్యూర్, రేర్ పాలసీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మాది గుడ్ గవర్నెన్స్ కాదు.. స్మార్ట్ గవర్నెన్స్: మండలిలో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తమది కేవలం గుడ్ గవర్నెన్స్ కాదని.. ‘స్మార్ట్ గవర్నెన్స్’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ శాసనమండలిలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు మెట్రో నగరాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలో వర్షం వచ్చిందంటే జనజీవనం స్తంభించి ఎటూ కదలలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. కానీ హైదరాబాద్ అంటే ‘లేక్స్ అండ్ రాక్ సిటీ’ అని కొనియాడారు. ప్రస్తుతం 'ఓల్డ్ సిటీ'గా పిలవబడే ప్రాంతమే అసలైన 'ఒరిజినల్ సిటీ' అని ఆయన స్పష్టం చేశారు.

క్యూర్, ప్యూర్, రేర్ పాలసీతో ముందుకు..

అద్భుతమైన హైదరాబాద్ నగరంలో మానవ తప్పిదాల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల ఆర్థిక స్తోమత పెరగడంతో వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని అన్నారు. అందుకే గతంలో బేగంపేట నుంచి శంషాబాద్‌కు విమానాశ్రయాన్ని తరలించామని గుర్తు చేశారు. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. గతంలో దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం 'క్యూర్, ప్యూర్, రేర్' (Cure, Pure, Rare) పాలసీతో ముందుకు వెళ్తోందని చెప్పారు. కాలుష్యకారక పరిశ్రమలను పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) బయటకు తరలిస్తామని, ఆ భూములను మల్టీ జోన్లుగా వినియోగించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.

కేంద్రం సూచనతోనే మెట్రో స్వాధీనం..

మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. కంటోన్మెంట్ కారణంగా ఉత్తర తెలంగాణ నుంచి నగరానికి వచ్చే ప్రజలు అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పంజాగుట్ట, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం వివరించారు.

Next Story