- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం దిశగా యువ తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.

- యువ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుంది
- విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు
- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం దిశగా యువ తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. గురువారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి ఐఎస్ బీ విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని కోరారు. ప్రభుత్వం విద్యారంగంలో ఊహించని స్థాయిలో పెట్టుబడులు పెడుతోందని, విద్యపై చేసే పెట్టుబడి రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుందని ప్రజా ప్రభుత్వం నమ్ముతోందని ఆయన వివరించారు.
ప్రపంచస్థాయి విద్య అందించడమే లక్ష్యం
రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక్కో పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 104 పాఠశాలల నిర్మాణం మొదలుపెట్టామని ఆయన వెల్లడించారు. విద్యార్థులు కళాశాల నుంచి బయటకు రాగానే ఉద్యోగం పొందేలా స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ రూపొందిస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఈ సిలబస్‌ను డిజైన్ చేశామని అన్నారు. మహిళల కోసం చాకలి ఐలమ్మ పేరిట నిర్మిస్తున్న మహిళా యూనివర్సిటీ భవనాలకు ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఐఎస్బీ నిర్వాహకులు స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సందర్శించి విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. అవి ప్రారంభ దశలో ఉన్నందున మీ సలహాలు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. తాను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నానని, రాసుకునేందుకు పలకలు కూడా లేకపోవడంతో ఇసుకపైనే అక్షరాలు దిద్దిన సందర్భాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వం,పరిశ్రమ-విద్యాసంస్థల సహకారం అవసరం
ఈ కార్యక్రమంలో మోతిలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ చేసిన సహకారం కేవలం విరాళం మాత్రమే కాదని, అది జ్ఞానం, నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వాలు రోడ్లు కడతాయి, కానీ దూరదృష్టి ఉన్న దాతృత్వం నేర్చుకునే ద్వారాలను నిర్మిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఐఎస్ బీను కేవలం విద్యాసంస్థగా కాకుండా, భాగస్వామిగా చూస్తుందని చెప్పారు. ముఖ్యంగా, సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్తో కలిసి "తెలంగాణ రైజింగ్ 2047" విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థలు కలిసినప్పుడే నిజమైన పరివర్తన సాధ్యమని అన్నారు. ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ సెంటర్ కేవలం భవనం కాదని, ఇది క్లాస్‌రూమ్‌లు, బోర్డు రూమ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు కలిసే ఒక కేంద్రంగా మారి, ఆలోచనలను పరిష్కారాలుగా మలచే స్థలం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు ఈ సెంటర్ దిక్సూచిలా నిలిచి వారిని అగ్రగామిత్వం, సమానత్వం, ఆవిష్కరణల వైపు దారి చూపాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యేలకు ఐఎస్బీలో శిక్షణ ఇవ్వాలి
స్కిల్స్ యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభమై వందలాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందని, 2025 నాటికి దాని శాశ్వత క్యాంపస్ "ఫ్యూచర్ సిటీ"లో ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. తనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిరంతరం నేర్చుకోవడానికి ఇష్టపడతారని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐఎస్ బీలో ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో మోతిలాల్ ఓస్వాల్, ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల, ప్రభాత్ సిన్హా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






