Revanth Reddy: తెలంగాణకు ఆ లోటు లేకుండా చేస్తా.. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: తెలంగాణకు ఆ లోటు లేకుండా చేస్తా.. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలన్నది మా ప్రభుత్వ ఆకాంక్ష అని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మా ప్రభుత్వం సమకూర్చుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. దావోస్ (Davos) లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), హీరో మోటార్ కార్ప్ (Hero Motor Corp) సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌజ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తామన్నారు.

అర్బన్ మొబిలిటీ భవిష్యత్తు పునాది:

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని పర్యావరణహితంగా హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలనేది మా అభిమతం అని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. భారత దేశంలోనే ఈవీ వాహనాలు అత్యధికంగా అమ్ముడుపోయే రాష్ట్రం తెలంగాణ అని ఎలక్టిక్ వెహికిల్స్ పై మేము ప్రత్యేక దృష్టిని సారించామని ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితులను పర్యావరణ అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. నగరాల అభివృద్ధికి, వాటి భవిష్యత్తుకు అర్బన్ మొబిలిటీ భవిష్యత్తుకు పునాది అని తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో చేరుకునే రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనగలుగుతాయని అభిప్రాయపడ్డారు. ఓఆర్ఆర్, ట్రిబుల్ ఆర్ కు అనుబంధంగా రేడియల్ రోడ్లను కూడా నిర్మిస్తామన్నరు.

Next Story