హాట్ టాపిక్‌గా OU వ్యవహారం.. లగ్జరీ కార్ల కొనుగోళ్ల కోసం యాజమాన్యం పట్టు

by Kema Shiva Kumar |

తెలంగాణలో ఉన్నత విద్యకు ప్రతీకగా నిలిచే ఉస్మానియా యూనివర్సిటీ కొత్త కోర్సుల విషయంలో తీసుకుంటున్న వైఖరి విమర్శలకు దారితీస్తోంది.

హాట్ టాపిక్‌గా OU వ్యవహారం.. లగ్జరీ కార్ల కొనుగోళ్ల కోసం యాజమాన్యం పట్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఉన్నత విద్యకు ప్రతీకగా నిలిచే ఉస్మానియా యూనివర్సిటీ కొత్త కోర్సుల విషయంలో తీసుకుంటున్న వైఖరి విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సూచించినప్పటికీ సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ యూనివర్సిటీ ముందుకు రావడం లేదు. బీటెక్ బయోటెక్నాలజీ, బీఏ హానర్స్ కోర్సులను 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని టీజీసీహెచ్ఈ ప్రతిపాదనలు పంపగా, ఓయూ ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది. అదే సమయంలో ఓయూ అధికారులు రూ. కోటి 20 లక్షల విలువ చేసే కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిబ్బంది కొరతే కారణమా?

రాబోయే విద్యా సంవత్సరంలో కొత్త ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు ప్రస్తుత టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు లభిస్తాయని ఉన్నత విద్యా మండలి అభిప్రాయపడింది. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని కౌన్సిల్ అధికారులు సూచించగా ఫ్యాకల్టీ, ల్యాబ్స్ లేని కారణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం కుదరదంటూ వర్సిటీ తిరస్కరించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్కు లేఖ రాయడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో కాలేజీలో కేవలం 4 యూజీ, 12 పీజీ కోర్సులున్నాయని, కానీ కేవలం ఐదుగురు మాత్రమే ఫ్యాకల్టీ ఉందని సమాధానం ఇచ్చారు. వర్సిటీలో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కొత్త కోర్సులను నిర్వహించడం సాధ్యం కాదని ఆయన ఉన్నత విద్యా మండలికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ బయోటెక్నాలజీ కోర్సు పెట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈనెల మొదట్లో ఓయూకు లేఖ రాసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, యూనివర్శిటీ కాలేజీల్లో బీటెక్ బయోటెక్నాలజీ కోర్సు పెట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి రావడంతో కమిటీ వేసి సిఫారసు చేసినట్లు టీజీసీహెచ్ఈ స్పష్టంచేసింది.

కొత్త కార్లు మాత్రం కావాలట..

ఒకవైపు కొత్త కోర్సులకు బోధన సిబ్బంది, ల్యాబ్స్ కొరత అంటూ కారణాలు చెబుతున్న యూనివర్సిటీ, మరోవైపు కొత్త కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపడం విద్యా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీసీ, ఇతర ఉన్నతాధికారుల కోసం దాదాపు రూ.కోటి 20 లక్షల రూపాయల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయాలని యూనివర్సిటీ యాజమాన్యం పట్టుబడుతున్నట్లు సమాచారం. దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఉన్నతాధికారుల సౌకర్యాలకే యూనివర్సిటీ ప్రాధాన్యత ఇస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నియామకాలకు నిధులు లేవని చెబుతున్న యూనివర్సిటీ, కార్ల కొనుగోలుకు నిధుల కోసం లాబీయింగ్ చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు లేకుండా తమ సొంత ప్రయోజనాలకే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. ఈ పరిణామాలు ఉస్మానియా వర్సిటీలో నిధుల వినియోగంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

Next Story