ఓఆర్ఆర్ ఏరియా TCURగా మార్పు.. GHMC చట్టానికి రెండు సవరణలు

by Kema Shiva Kumar |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీల ఏరియాగా పరిగణిస్తున్నారు.

ఓఆర్ఆర్ ఏరియా TCURగా మార్పు.. GHMC చట్టానికి రెండు సవరణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీల ఏరియాగా పరిగణిస్తున్నారు. కానీ, ఈ ఏరియాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించాలని నిర్ణయించింది. అయితే రెండేండ్లుగా టీసీయూఆర్‌గా పిలుస్తున్నారు తప్ప.. దీనికి ఎలాంటి చట్టబద్దతలేదు. జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసిన తర్వాత తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌కు చట్టబద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. బుధవారం నుంచి ఈ ఏరియాను టీసీయూఆర్‌గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరో రెండు ఆర్డినెన్స్‌లు ఇలా..

జీహెచ్ఎంసీని విస్తరించాలనే నేపథ్యంలో ప్రభుత్వం మూడు ఆర్డినెన్స్‌లు తీసుకురావాలని నిర్ణయించింది. వీటిలో రెండు జీహెచ్ఎంసీకి, ఒకటి మున్సిపల్ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌కు చట్టబద్దత కల్పించనున్నారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది. దీంతోపాటు జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. దీంతోపాటు 27 పట్టణ స్థానిక సంస్థలను మున్సిపల్ శాఖ నుంచి తొలగించడానికి మరో ఆర్డినెన్స్ కూడా తీసుకురానున్నారు. ఈ రెండు ఆర్డినెన్స్‌లకు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక మాస్టర్ ప్లాన్..

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌కు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం హెచ్ఎండీఏ-2050 మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. టీసీయూఆర్ ఏరియాకూ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ కవర్ అవుతుంది. కానీ, టీసీయూఆర్ పరిధిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు, వరద నీటి కాలువల వ్యవస్థ ఏర్పాటు, నీటి వనరుల సంరక్షణ, పార్కులు, గ్రీన్ ఏరియాను గుర్తించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story