CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-07 08:07:43  IST  )

ఆపరేషన్ సింధూర్ పై రివ్యూ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు.

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్..  సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో రాజకీయాలకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఈ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి:

ఉద్యోగులు, మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర మెడిసిన్, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలన్నారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలన్నారు. ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

భద్రత పెంచండి:

అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలని శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలన్నారు. హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల వద్ద భద్రత పెంచాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీ మీద దృష్టి సారించాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలని హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలించారు.

సైన్యానికి సంఘీభావంగా రేపు ర్యాలీ:

దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇచ్చేలా భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు.

Next Story