బాలికల గురుకులాల్లో మహిళా సిబ్బందే ఉండాలి!

by Ajay Maddhiboyina |

తెలంగాణలోని బాలికల గురుకులాలు, కళాశాలల్లో అన్ని కేటగిరీల పోస్టుల్లో మహిళా సిబ్బంది ఉండాలని గురుకుల సొసైటీ స్పష్టం చేసింది.

బాలికల గురుకులాల్లో మహిళా సిబ్బందే ఉండాలి!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని బాలికల గురుకులాలు, కళాశాలల్లో అన్ని కేటగిరీల పోస్టుల్లో మహిళా సిబ్బంది ఉండాలని గురుకుల సొసైటీ స్పష్టం చేసింది. ఈమేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో బాలికల భద్రత సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలలో మహిళా టీచర్స్​, సిబ్బంది, సబార్డినేటర్లు నియమకం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా బాలికలకు మరింత భద్రత, అనుకూల వాతావరణం ఉండాలన్న ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ సోషల్ ​వెల్ఫేర్ ​రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇన్సిస్ట్యూషన్స్ సోసైటీ మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలని భావించి టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి వర్షిణి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని బాలికల గురుకులాలు, కళాశాలల్లో అన్ని కేటగిరీల పోస్టుల్లో మహిళా సిబ్బంది ఉండాలని ఆమె స్పష్టం చేశారు. గతంలో సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నం.1274 ఉత్తర్వులు యథావిధిగా అమలు చేయాలని ఆమె జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కన్నారు. అలాగే, తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనల విషయంలోని రూల్ 22 (ఏ) (3) ప్రకారం బాలికల స్కూళ్లు, విద్యా సంస్థల్లో అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బందిని మాత్రమే భర్తీ చేయాలని సూచించారు.

పురుష సిబ్బంది ఉంటే కఠిన చర్యలు.. బాలుర పాఠశాలలు, విద్యాసంస్థల్ని జనరల్​గా పరిగణిస్తూ అందులోని పోస్టులను మహిళలు, పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొంది. బాలికల పాఠశాలలు, బాలుర పాఠశాలలకు ప్రత్యేక రోస్టర్​ను ఏర్పాటు చేయాలని సూచించారు. గురుకుల సొసైటీలోని మల్టీజోనల్ అధికారులు, జోనల్ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఎక్కడైనా బాలికల స్కూళ్లు, విద్యాలయాల్లో పురుష సిబ్బంది ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి డ్యూటీలో ఉన్నటువంటి 50 ఏళ్లు పైబడిన పురుష ఉద్యోగుల వయస్సును బట్టి వారిని కొనసాగించాలా? వద్దా.. అన్నదానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

పురుష ఉద్యోగుల ఆందోళన..

తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బాలికల గురుకులాలు, కాలేజీలో టీచింగ్, నాన్​టీచింగ్ ​సిబ్బంది డ్యూటీలు నిర్వర్తిస్తన్నారు. అయితే, ప్రస్తుతానికి తమ పరిస్థితి ఏమిటన్నదానిపై ఆందోళన చెందుతున్నారు. కొన్నేండ్లుగా కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ కింద ఉద్యోగాలు చేస్తున్న తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు.

Next Story