- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3 నెలల్లో ఒక్కటే ఫీల్డ్ విజిట్..! ఆ IAS తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
మూడు నెలల కాలంలో కేవలం ఒక్కరోజు మాత్రమే క్షేత్రస్థాయి పర్యటన చేసిన ఒక జిల్లా కలెక్టర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయనో ఐఏఎస్ అధికారి. జిల్లాకు కీలకమైన కలెక్టర్ హోదాలో పనిచేశారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆఫీసు విడిచి ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు. సదరు బ్యూరోక్రాట్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సెక్రటేరియట్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరును తెలుసుకున్నారు. అయితే 2017వ బ్యాచ్ కు చెందిన ఓ ఐఏఎస్ ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఫీల్డ్ విజిట్ కు వెళ్లిన విషయాన్ని సీఎస్ రామకృష్ణారావు తన నివేదిక చదవి వినిపించారు. వెంటనే జోక్యం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ వివరాలను సీఎం ఆరా తీసినట్లు తెలిసింది.
సీఎం ఆదేశాలు బేఖాతరు
ప్రతి కలెక్టర్ వారంలో ఒకరోజు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని, ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని, గురుకులాలకు వెళ్లి పిల్లలతో కలిసి భోజనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో నిర్వహించిన సదస్సులో ఆదేశించారు. మూడు నెలల తర్వాత జరిగే కాన్ఫరెన్స్ లో కలెక్టర్ల పనితీరుపై తనకు నివేదిక ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావును కోరారు. దీంతో ఈనెల 3న జరిగిన కాన్ఫరెన్స్ లో కలెక్టర్ల ఫీల్డ్ విజిట్ వివరాలను సీఎంకు వివరించారు. ‘మూడు నెలల కాలంలో చాలామంది క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ఓ కలెక్టర్ 26 సార్లు ఫీల్డ్ కు వెళ్లగా, మరో కలెక్టర్ మాత్రం కేవలం ఒక్కరోజు మాత్రమే ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు.’ అని తెలిపారు. దీనితో ఆ ఒక్కసారి పర్యటనకు వెళ్లిన కలెక్టర్ పేరు ఏమిటి? ఏ జిల్లాలో పనిచేశారు? అని సీఎం ఆరాతీయగా సదరు ఐఏఎస్ అధికారి వివరాలను చీఫ్ సెక్రటరీ బహిర్గతం చేశారు. మీటింగ్ ముగిసిన తర్వాత సదరు అధికారి గురించి మిగతా ఐఏఎస్ లు చెవులు కొరుక్కున్నట్లు తెలిసింది. ఫీల్డ్ కు వెళ్లేందుకు ఆయనకు అంతగా ఆసక్తి ఉండదని, ఇతర వ్యాపకాలపై ఎక్కువ చొరవ ఉంటుందని సెటైర్లు వేసుకున్నట్లు సమాచారం.
అవినీతి ఆరోపణలతో ట్రాన్స్‌ఫర్
సదరు కలెక్టర్ ఆ జిల్లాలో 22 నెలల పాటు పనిచేశారు. మొదట్లో మంచి అధికారిగా అందరి ప్రశంసలు పొందిన ఆ ఐఏఎస్ ఏడాది తర్వాత వివాదస్పదుడిగా ముద్రపడింది. అదే సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, రూలింగ్ పార్టీ లీడర్లతో విబేధాలు తలెత్తడంతో నెల రోజుల క్రితం ఆయనపై బదిలీ వేటుపడింది. జిల్లా కలెక్టర్ గా తప్పించి సెక్రటేరియట్ లోని ఓ శాఖలో స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ ఆయన పనితీరును ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.






