- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సగమే ప్రాసెసింగ్.. గుట్టలుగా చెత్త..! జవహర్ నగర్ కాలుష్యంతో జనం బెంబేలు
హైదరాబాద్‌లో ప్రతిరోజూ 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోతుండటంతో జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై ఒత్తిడి తీవ్రమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూర్ పరిధిలో చెత్తను మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డులో డంప్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు చెందిన చెత్తను అక్కడే డంప్ చేస్తున్నారు. 15 ఏండ్లుగా అక్కడ చెత్త పేరుకుపోయింది. శాస్త్రీయ బద్దమైన డిస్పోజల్ లేకపోవడంతోనే చెత్త పేరుకుపోయిందనే విమర్శలున్నాయి. దీంతోపాటు శాస్త్రీయంగా డిస్పోజల్ పేరుతో వందల కోట్లు ఖర్చు చేసినా ఫలితంలేకుండా పోయింది. దీంతో జవహర్ నగర్ డంపింగ్ యార్డు అంటేనే కాలుష్యానికి కేంద్రంగా మారింది. ఈ డంపింగ్ యార్డుపై ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం మరో నాలుగు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నా కొలిక్కి రావడంలేదు. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో సైంటిఫిక్ డిస్పోజల్ జరగకపోవడంతో గుట్టలా పేరుకుపోవడంతో కొత్త ప్రాంతాల్లో ఏర్పాటుకు స్థానికులు నిరాకరిస్తున్నారు. దీంతోపాటు గతంలో ప్యారనగర్‌లో డంపింగ్ యార్డు చేయాలని ప్రతిపాదించిన బీఆర్ఎస్ ప్రస్తుతం దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం విమర్శలకు దారితీసింది. ఒక్క మాటలో చెప్పాలంటేనే డంపింగ్ యార్డు ఏర్పాటు అంటేనే ప్రజలు జంకుతున్నారు.
10 వేల మెట్రిక్ టన్నుల చెత్త
జీహెచ్ఎంసీ నుంచి 5 వేల మెట్రిక్ టన్నులు, సీఎంసీ నుంచి 2,500 మెట్రిక్ టన్నులు, ఎంఎంసీ నుంచి 2,500 మెట్రిక్ టన్నులు మొత్తం 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 339 ఎకరాల స్థలాన్ని కేటాయించి, హైదరాబాద్ నగరంలో నిత్యం వెలువడుతన్న వ్యర్థాలను అక్కడికి తరలించింది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్‌ఫర్ పాయింట్స్ (ఎస్‌సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్‌నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు. 2007 నుంచి 2012 వరకు సరైన నిర్వహణ లేకపోవడంతో దాదాపు 125 ఎకరాల్లో చెత్త పేరుకుపోయింది. దీని నిర్వహణ కోసం 2009లో రాంకీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న పలు కారణాలతో 2012 వరకు అమలులోకి రాలేదు. ఆ తరువాత 2012 నుంచి వ్యర్థాల నిర్వహణ మొదలైంది. 2014లో 3500మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయితే నేడు 10వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
సగమే ప్రాసెసింగ్
జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వస్తున్న చెత్తలో సగాన్ని మాత్రమే ప్రాసిసంగ్ చేస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి 350 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం 750 గ్రాములకు పెరిగింది. 45 శాతం తడి చెత్త, 55 శాతం డ్రై వేస్ట్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. తడి చెత్తను కంపోస్టుగాను, పొడి చెత్తను ఆర్డీఎఫ్‌గా కన్వర్ట్ చేస్తున్నారు. దీన్ని సిమెంట్ కంపెనీలు అయిల్‌గా వాడుకుంటున్నాయి. దీంతోపాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతిరోజూ 2500 టన్నుల ఆర్డీఎఫ్ ఉత్పత్తి అవుతోంది. దీంతో 48 మెగావాట్ల విద్యుత్‌ను తయారు చేస్తున్నారు. సగానికిపైగా చెత్త పేరుకుపోవడంతో గుట్టగా మారింది. దీని నుంచి వాసన రాకుండా గత ప్రభుత్వం హయాంలో సుమారు రూ.150 కోట్లకుపైగా ఖర్చు పెట్టి క్యాపింగ్ వేశారు. మరో రూ.100 కోట్లతో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. క్యాపింగ్ పై చెత్త వేయడంతోపాటు లీచెట్ ప్లాంట్ చేయడంలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతోపాటు దుండిగల్‌లో 85 ఎకరాల్లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను మాత్రమే నిర్వహిస్తున్నారు. అక్కడ చెత్తను డంప్ చేయడానికి స్థానికులు అంగీకరించడంలేదు. ఇక్కడ జవహర్ నగర్ లాగా కాకుండా మాడ్రన్ టెక్నాలజీతో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేయడంతోపాటు ఆర్డీఎఫ్‌ను విద్యుత్ తయారీకోసం వినియోగించాలని నిర్ణయించారు.
స్థానికుల నుంచి వ్యతిరేకత
జవహర్ నగర్ డంపింగ్ యార్డు చూసి ఇతర ప్రాంతాల్లో స్థానికులు ముందుకురావడంలేదు. అయితే దుండిగల్ తరహాలో ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంగారెడ్డి జిల్లా లక్డారంలో 100 ఎకరాలు, ప్యార నగర్‌లో 125 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని మల్కాపురంలో 200 ఎకరాలు, మేడ్చల్ జిల్లాల్లోని దుండిగల్‌లో 85 ఎకరాలను అధికారులు గుర్తించారు. గతంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట్‌లోనూ 150 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అయితే ఏ ప్రాంతంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేద్దామని అధికారులు ప్రయత్నించినా స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దుండిగల్ లో మాత్రమే మోడ్రన్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ప్యార నగర్‌లోనూ మోడ్రన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసినా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త ప్రాంతాలను సైతం గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది.






