సచివాలయానికి క్రమం తప్పకుండా వచ్చేది 8 మంది మంత్రులే

by Malleboina Mahesh |

కేబినెట్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మినహాయించి 15 మంది మంత్రులు ఉంటే, అందులో సగం మంది మాత్రమే రెగ్యూలర్‌గా సెక్రెటేరియట్‌కు వస్తుంటారు.

సచివాలయానికి క్రమం తప్పకుండా వచ్చేది 8 మంది మంత్రులే
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేబినెట్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మినహాయించి 15 మంది మంత్రులు ఉంటే, అందులో సగం మంది మాత్రమే రెగ్యూలర్‌గా సెక్రెటేరియట్‌కు వస్తుంటారు. మిగతా సగం మంది మంత్రులు అమాసకో, పున్నానికో వస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. అందులో కొందరైతే పక్షంలో ఒక్కసారి కూడా సచివాలయం మొహం చూడని మంత్రులు ఉన్నారనే చర్చ జరుగుతున్నది. కేబినెట్ సమావేశం ఉన్నప్పుడో, అర్జెంట్ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే ప్రత్యక్షమవుతుంటారు. దీంతో అంత మాత్రానికే సదరు మంత్రులకు అంతపెద్ద చాంబర్లు, అటెండర్లు, పేషీలు ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వచ్చేది వీరే..

హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న సమయంలో సెక్రెటేరియ‌ట్‌కు 8 మంది మంత్రులు వస్తుంటారు. ఆ జాబితాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉన్నారు. అధికారులతో వారంతా సమావేశాలు నిర్వహిస్తుంటారు. తమ పరిధిలోని శాఖలో ఏదైనా సమస్య తలెత్తితే.. సదరు ఆఫీసర్లను పిలిచి ఆరా తీస్తుంటారు. తగిన సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఒకవేళ హెచ్ఓడీ స్థాయి అధికారులతోనే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తే.. సదరు ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడటం, వీలైతే సెక్రెటేరియట్‌కుపిలిచి గైడెన్స్ ఇస్తుంటారు. కొన్నిసార్లు కుదిరితే హెచ్ఓడీ ఆఫీసుకు వెళ్లి అక్కడే అధికారులతో సమావేశం నిర్వహిస్తుంటారు. రెగ్యూలర్‌గా సెక్రెటేరియట్‌కు వచ్చే మంత్రులు తమ ఆమోదం కోసం వచ్చే ఫైల్స్‌ను అక్కడే క్లియర్ చేస్తుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే, ఇంటికి వెళ్ళాక సంతకాలు చేసి పేషీకి పంపుతుంటారు.

విజిటర్ల నుంచి వినతి పత్రాలు

రెగ్యూలర్‌గా సెక్రెటేరియట్‌కు వచ్చే మంత్రుల్లో ఒకరిద్దరు మినహా మిగతా మంత్రులు అందరూ విజిటర్స్‌ను కలుస్తుంటారు. నియోజకవర్గానికి చెందిన ప్రజలు కనిపిస్తే, వారికి కాస్త ఎక్కువ సమయం ఇస్తుంటారు. వారి నుంచి వినతి పత్రాలు తీసుకోవడం, సమస్యలను విని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుంటారు. తమ శాఖకు చెందిన సమస్య ఉంటే వెంటనే తమ సిబ్బందికి చెప్పి పరిష్కారం చూపాలని ఆదేశిస్తుంటారు. ఒకవేళ ఇతర శాఖకు చెందిన పని ఉంటే, సంబంధిత శాఖ మంత్రికో, అధికారికో సిఫారసు లేఖలు రాస్తుంటారు.

10 గంటలకే ప్రత్యక్షం..

హైదరాబాద్‌లో ఉంటే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉదయం 10 గంటలకే సెక్రెటేరియట్‌లోని తన చాంబర్‌లో ప్రత్యక్షం అవుతారు. ఆయన టైమ్‌కు రావడమే కాక, తన శాఖలోని అధికారులు, స్టాఫ్ సైతం వచ్చారా? లేదా? అని ఆరా తీస్తుంటారు. వ్యవసాయ, మార్కెటింగ్, కో ఆపరేటివ్ శాఖల పరిధిలో ఉన్న అన్ని హెచ్ఓడీల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది అటెండెన్స్‌ను సైతం తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ లో ఉన్న మీటింగ్స్ అన్ని పూర్తయ్యే వరకు సెక్రెటేరియట్‌లో ఉంటారు. ఫైల్స్ క్లియర్ చేసి మధ్యాహ్నం రెండు తర్వాత ఇంటికి వెళ్తారు. ఒకవేళ సాయంత్రం మీటింగ్స్ ఉంటే, తిరిగి సెక్రెటేరియట్‌కు వస్తుంటారు. వివిధ పనుల కోసం వచ్చే విజిటర్స్‌తో మాట్లాడి, వారి నుంచి వినతి పత్రాలు తీసుకుంటారు.

ఆయన ఉన్నంత సేపు చాంబర్ డోర్లు ఓపెన్..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సెక్రెటేరియట్‌లో ఉన్నంత సేపు ఆయన చాంబర్ డోర్లు ఓపెన్‌గా ఉంటాయి. విజిటర్స్ ఎవరైనా ముందుస్తు అనుమతి లేకుండానే ఆయన చాంబర్‌లోకి వెళ్లొచ్చు. వారి సమస్యలను వివరించవచ్చు. ఒకరి తర్వాత మరొకరిని వరుసగా అందరి ముందే కలుస్తుంటారు. ఒకవేళ వ్యక్తిగత విషయాలు, కాన్ఫిడెన్షియల్ అంశాలను వివరిస్తామని చెప్పిన వారిని తన యాంటీ రూమ్‌లోకి తీసుకెళ్లి మాట్లాడుతుంటారు. తన శాఖ పరిధిలోని అధికారులతో రివ్యూలను తన కాన్ఫరెన్స్ హాలులో నిర్వహిస్తుంటారు.

విజిటర్స్ కోలాహాలం..

సెక్రెటేరియట్‌లో ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ మంత్రి సీతక్క చాంబర్ ముందు కనిపిస్తుంటారు. ఆమె చాంబర్ ముందు జనాలు ఎక్కువగా ఉంటే, ఆ రోజు మంత్రి చాంబర్‌లో ఉన్నట్టుగా భావిస్తుంటారు. నియోజకవర్గానికి చెందిన విజిటర్స్‌ను ఎక్కువగా సెక్రెటేరియట్‌కు పిలిచి వారి సమస్యలను వింటుంటారు. అలాగే తన శాఖ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం వచ్చే విజిటర్స్‌ను సైతం అక్కడే కలుస్తుంటారు.

అఫీషియల్ విజిటర్స్‌కు ప్రయారిటీ..

మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిరోజూ తన నియోజకవర్గానికి చెందిన విజిటర్స్‌ను ఎక్కువగా మినిస్టర్ క్వార్టర్స్ లేదా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలుస్తుంటారు. ఒకవేళ ఆలస్యంగా వచ్చిన విజిటర్స్‌ను మాత్రమే సెక్రెటేరియట్‌లో టైమ్ ఇస్తారు. సెక్రెటేరియట్‌లో మాత్రం ఎక్కువగా అఫీషియల్ విజిటర్స్‌కు టైమ్ ఇస్తుంటారు. అందులో పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీల ప్రతినిధులు, పలు దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు ఉంటారు. అక్కడే వారితో మీటింగ్స్ నిర్వహిస్తుంటారు. అందుకు తగ్గట్టుగా ఆయన తన చాంబర్‌లో ఏర్పాట్లు చేసుకున్నారు.

ఓపెన్‌గా చెప్పే మినిస్టర్..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖ పరిధిలోని అధికారులతో ఎక్కువగా సెక్రెటేరియట్‌లోనే సమీక్షలు నిర్వహిస్తుంటారు. సమీక్షలు పూర్తవగానే నియోజకవర్గానికి చెందిన విజిటర్స్‌ను కలిసేందుకు ప్రయారిటీ ఇస్తుంటారు. వారి సమస్యలను విని వెంటనే సదరు అధికారులతో ఫోన్ మాట్లాడుతారు. ఒకవేళ సిఫారసు లెటర్ అవసరమైతే వెంటనే రాసివ్వమని తన పేషీ అధికారులను ఆదేశిస్తుంటారు. కానీ తన పరిధిలో పరిష్కారం కాని సమస్య ఉంటే నిర్మొహమాటంగా అందరి ముందే ‘ఆ పని కాదు.. నేను చెయ్యలేను.. మళ్లీ అడగొద్దు’ అంటూ ఓపెన్‌గా చెప్పేస్తుంటారు.

రివ్యూల మీద రివ్యూలు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో ఉంటే సెక్రెటేరియట్‌లో ఏదో ఒక రివ్యూ తప్పకుండా నిర్వహిస్తుంటారు. ప్రభుత్వంలోని సుమారు 15 మంత్రివర్గ ఉపసంఘాలకు ఆయనే చైర్మన్‌గా ఉన్నారు. ప్రతి శుక్రవారం ఆర్థిక వనరుల సమీకరణ సబ్ కమిటీ తప్పకుండా సమావేశం అవుతుంటుంది. మిగతా రోజుల్లో ఆర్థికశాఖలోని పలు అంశాల రివ్యూలతో పాటు ఎనర్జీ శాఖకు చెందిన రివ్యూలను సైతం అక్కడే నిర్వహిస్తుంటారు. అప్పుడప్పుడు ట్రాన్స్ కో ఆఫీస్ లో సైతం సమీక్షలు పెడుతుంటారు. నియోజకవర్గానికి చెందిన విజిటర్స్, ముందస్తు అపాయింట్మెంట్ ఉన్న విజిటర్స్‌ను ఇంటి వద్ద కలుస్తుంటారు.

ధరణి బాధితుల బారులు..

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సెక్రెటేరియట్‌లో కలిసేందుకు వచ్చే విజిటర్స్‌లో మెజార్టీ మంది ధరణి బాధితులే ఎక్కువగా ఉంటారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం కొందరు, సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం కాలేదని ఇంకొందరు ఆయనకు వినతిపత్రాలు ఇస్తుంటారు. డబుల్ బెడ్ రూమ్‌ల దరఖాస్తుదారులు సైతం తమకు ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తుంటారు.

హైదరాబాద్ విజిటర్స్ క్యూ..

మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉండటంతో ఆయనను సెక్రెటేరియట్‌లో కలిసే విజిటర్స్‌లో ఎక్కువమంది సిటీకి చెందిన వారే ఉంటారు. పింఛన్ల కోసం, డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం, రేషన్ కార్డుల కోసం ఆయనకు దరఖాస్తులు ఇస్తుంటారు. సొంత నియోజకవర్గం నుంచి వచ్చే విజిట‌ర్స్‌ను ఆయన మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిసి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు.

Next Story