Maoists: దేశవ్యాప్తంగా ఇంకా మిగిలింది 300 మంది మావోయిస్టులే: సీఆర్‍పీఎఫ్

by Prasad Jukanti |   (  Updated:2026-02-19 11:19:59  IST  )

మావోయిస్టుల నిర్మూలనకు గడువు సమీపిస్తున్న వేళ ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టుల సంఖ్యపై సీఆర్‍పీఎఫ్ కీలక ప్రకటన చేసింది.

Maoists: దేశవ్యాప్తంగా ఇంకా మిగిలింది 300 మంది మావోయిస్టులే: సీఆర్‍పీఎఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31 గడువు దగ్గరపడుతుండటంతో భద్రతా దళాలు లాస్ట్ పంచ్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులపై ఇప్పటికే విరుచుకుపోడుతున్న భద్రతా బలగాలు ఇంకా ఎంత మంది మిగిలిఉన్నారన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 300 మంది మావోయిస్టులు (Maoists) మాత్రమే మిగిలి ఉన్నారని తాజాగా సీఆర్‍పీఎఫ్ (CRPF) (KGH-2) వెల్లడించింది. వీరంతా ప్రధానంగా ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులు (Chhattisgarh-Telangana Border) జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం.

సెంట్రల్ కమిటీలో నలుగురే:

మొత్తం 300 మంది మావోయిస్టులు ఉంటే అందులో సెంట్రల్ కమిటీ కి చెందిన వారు కేవలం నలుగురు మాత్రమే ఉననట్లు సీఆర్ పీఎఫ్ వర్గాలు తెలిపారు. గణపతి, దేవుజీ, మల్లా రాజారెడ్డి, మిసిర్ బెస్రా మాత్రమే సెంట్రల్ కమిటీ నుంచి మిగిలినట్లు ఈ వార్గాలు పేర్కొన్నాయి. నిజానికి గతేడాది వరకు సీసీఎం సభ్యులు 20 మంది ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు నాలుగుకు పడిపోయింది. ఈ నలుగురి కోసం భద్రతా దళాలు 24 గంటలు పని చేస్తున్నాయని వర్గాలు తెలిపారు. ముఖ్యంగా దేవూజీతో పాటు జూనియర్ క్యాడర్ కేశా సోధిని పట్టుకోవడానికి భద్రతా దళాలు ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ‘నక్సల్స్‌ మిషన్‌-2026’లో భాగంగా సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ‘కేజీహెచ్‌-2’ (కర్రె గుట్టలు హిల్స్‌-2) పేరుతో రెండు రోజుల క్రితం నుంచి 2 వేల మందితో కూడిన బలగాలతో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టగా అక్కడ ఇవాళ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలను అధికారవర్గాలు వెల్లడించాల్సి ఉంది.

భారీగా తగ్గిన హింస:

గతేడాది భద్రతా సిబ్బంది నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లలో 370 మంది మావోయిస్టులు చనిపోయారని. 2,391 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోగా 1,175 మందిని అరెస్టు చేసినట్లు సీఆర్‍పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇక 2010 మరియు 2025 మధ్య మావోయిస్టుల హింస 88 శాతం తగ్గిందని ఇటీవల కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలియజేశారు. దీంతో పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు కూడా గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు. 2010లో 1,005 గా ఉన్న మరణాలు 2025లో 100కి 90 శాతం తగ్గాయని షా చెప్పారు.

Next Story