- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీజీ నర్సింగ్‌లో కేవలం 30 సీట్లే..! రాష్ట్రంలో ఒకే ప్రభుత్వ పీజీ నర్సింగ్ కాలేజీ
రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి నర్సింగ్ విద్యార్థులు వెన్నెముకగా నిలుస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి నర్సింగ్ విద్యార్థులు వెన్నెముకగా నిలుస్తున్నారు. అయితే, రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్ నర్సింగ్ సీట్లు గణనీయంగా ఉన్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) నర్సింగ్ సీట్లు మాత్రం అత్యంత తక్కువగా ఉండడంపై విద్యార్థులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంతోపాటు విదేశాల్లోనూ అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉండడంతో దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. పీజీ నర్సింగ్ పూర్తి చేసిన వారు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, నిర్వహణ, బోధన, పరిశోధన రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తారు.
సీటు కోసం తీవ్ర పోటీ
రాష్ట్రంలో 37 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2,340 బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాతే 16 నర్సింగ్ కాలేజీలు ప్రారంభం కావడం గమనార్హం. ఎంఎస్సీ నర్సింగ్ (పీజీ) చదువుకోవాలంటే మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం ఒక్క నర్సింగ్ కాలేజీ మాత్రమే (నగరంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్) పీజీ కోర్సును అందిస్తోంది. ఇందులో కేవలం 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 2,340 మంది విద్యార్థులు పట్టభద్రులైతే, వారిలో పీజీ చదివే అవకాశం దక్కేది కేవలం 30 మందికే.
పేద విద్యార్థులకు ఫీజుల భారం
ప్రైవేటు రంగంలో 22 కాలేజీల్లో 479 పీజీ సీట్లు ఉంటే ప్రభుత్వ రంగంలో కేవలం 30 సీట్లు మాత్రమే ఉండటం నర్సింగ్ విద్యలో ప్రభుత్వ ప్రాధాన్యతలేమిని సూచిస్తోంది. ప్రభుత్వ పీజీ సీట్లు తక్కువగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ఫీజులు ఉండే ప్రైవేటు కళాశాలల్లో చేరాల్సి వస్తోంది. రెండేళ్ల పీజీ కోర్సుకు గాను సుమారు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రభుత్వ సంస్థల్లో తక్కువ ఫీజుతో పీజీ విద్య అందుబాటులో లేకపోవడం వల్ల ఉన్నత విద్య వారికి కలగానే మిగిలిపోతోంది.
ఉద్యోగాల విస్తరణకు అడ్డంకి
ఎంఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు నర్సింగ్ సూపర్‌వైజర్లు, ట్యూటర్లు, లెక్చరర్లు వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చడానికి పీజీ నర్సింగ్ విద్యార్థులు కీలకం. రాష్ట్ర ప్రభుత్వం పీజీ సీట్లను పెంచితే, నర్సింగ్ విద్యలో బోధన, పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుంది. తద్వారా, మరిన్ని ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయి. అలాగే విదేశాల్లోనూ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వారికి విపరీతమైన డిమాండ్ ఉంది.
ప్రభుత్వం దృష్టి సారించాలి
నర్సింగ్ పీజీ సీట్లను పెంచాలని విద్యార్థి సంఘాలు, నర్సింగ్ అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఉన్న 37 ప్రభుత్వ యూజీ కాలేజీల్లో కనీసం సగం కాలేజీల్లో అయినా తక్షణమే పీజీ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచే అవకాశం ఉంది.
తెలంగాణలో నర్సింగ్ సీట్ల వివరాలు
ప్రభుత్వ యూజీ కాలేజీలు 37: సీట్లు 2,340
ప్రైవేటు యూజీ కాలేజీలు 95: సీట్లు 5,630
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యూజీ కాలేజీలు 132: సీట్లు 7970
ప్రభుత్వ పీజీ కాలేజీలు 1: సీట్లు30
ప్రైవేటు రంగంలో కాలేజీలు 22.. సీట్లు 479
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పీజీ కాలేజీలు 23.. సీట్లు 509






