బకాయిల క్లియరెన్స్‌కు ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’: జలమండలి, విద్యుత్ సంస్థలకు భారీ ఊరట

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన రూ.వేల కోట్ల బకాయిల క్లియరెన్స్‌కు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బకాయిల క్లియరెన్స్‌కు ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’: జలమండలి, విద్యుత్ సంస్థలకు భారీ ఊరట
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జలమండలి, విద్యుత్​సంస్థలకు ప్రభుత్వ శాఖలు భారీగా బకాయి పడ్డాయి. ఒక్కో సంస్థకు రూ.వేల కోట్లు రావాల్సి ఉన్నది. దీంతో పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయా శాఖలకు సర్కారు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. బకాయిలు, వాటిపై వడ్డీలు, జరిమానాలు ఇవన్నీ కలిపి చెల్లించాల్సిన బిల్లులు ఆయా శాఖలకు, సంస్థలకు తడిసి మోపడయ్యాయి. దీంతో వాటిని ఏ విధంగా చెల్లించాలో తెలియక అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

జలమండలికి రూ.5,864 కోట్లు..

తాజాగా జరిగిన కేబినెట్​సమావేశంలో జలమండలికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో వడ్డీ, ఫైన్లు కట్టాల్సిన అవసరం లేదని మినహాయింపులు ఇస్తూ కేబినెట్​నిర్ణయం తీసుకున్నది. దీంతో వన్ టైమ్ సెటిల్‌మెంట్ వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలమండలికి వివిధ శాఖల నుంచి దాదాపు రూ.5,864 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించగా.. వన్‌టైమ్ సెటిట్‌మెంట్ ద్వారా రూ.1,686 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

మిషన్ భగీరథ నుంచి విద్యుత్ శాఖకు రూ.5 వేల కోట్లు

మిషన్ భగీరథ నుంచి విద్యుత్​శాఖకు దాదాపుగా రూ.5 వేల కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వ స్థాయిలో బుక్​అడ్జెస్ట్‌మెంట్​చేస్తారని అధికారులు చెబుతున్నారు. దీనితో పాటుగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు రూ.500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నది. ఇలా అనేక శాఖలు విద్యుత్, మున్సిపల్ శాఖలకు భారీ మొత్తంలో బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచినట్టు గుర్తించారు.

విద్యుత్‌శాఖ నుంచి సింగరేణికి..

విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ శాఖల నుంచి రూ.వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యుత్​సంస్థలు.. సింగరేణి, ఇతర వాటికి చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేకపోతున్నది. దీంతో పాటుగా అనేక సంస్థలకు విద్యుత్ శాఖ బకాయిలు పడుతున్నది. ఇలా ఒక దానికి ఒకటి లింక్ ఉండటంతో సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని, ఎవరికి వారు తమ తప్పులేదంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. వీటన్నింటికీ స్వస్తి పలకడానికి వీలుగా ఆయా సంస్థలు వెంటనే బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది.

Next Story