- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామీణ మహిళల జీవనోపాధుల బలోపేతానికి మరో అడుగు
గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత జీవనోపాధుల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పివి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్ టీవీయూ) సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత జీవనోపాధుల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పివి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్ టీవీయూ) సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లోని బిఆర్‌కెఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ వంటి రంగాల్లో సాంకేతిక మార్గదర్శకత్వం, శిక్షణ అందించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ, గ్రామీణ పేద కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, సమాఖ్యలను మరింత బలోపేతం చేసి గ్రామీణ మహిళల్లో స్వావలంబన, సామూహిక భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థిక సౌకర్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్), రుణాల ద్వారా పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల నర్సరీలు, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ మదర్ యూనిట్లు, పక్షుల యూనిట్ల ఏర్పాటు వంటి కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
మహిళలకు పశపోషణ, ఆరోగ్య సంరక్షణపై శిక్షణ:
అవగాహన ఒప్పందం ప్రకారం పీవీఎన్‌ఆర్‌టీయూ, సెర్ప్ లబ్ధిదారులకు సాంకేతిక నైపుణ్యాలు, సామర్థ్యాభివృద్ధి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది. పశు పోషణ, ఆరోగ్య సంరక్షణ అంశాల్లో శాస్త్రీయ మార్గదర్శకత్వం అందించనుంది. పీవీఎన్‌ఆర్‌టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. శరత్ చంద్ర మాట్లాడుతూ, పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ రంగాల్లో సెర్ప్ మహిళలకు విశ్వవిద్యాలయం పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు. పాల ఉత్పత్తి , పశువుల ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యల్లో పోషకాహార లోపం, ఖనిజాల కొరత ఒకటని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి పశువుల ఉత్పాదకత, పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచే ప్రత్యేక మినరల్ మిశ్రమాన్ని విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిందని, దాన్ని సెర్ప్‌కు అనుబంధంగా ఉన్న రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మాంసం, గుడ్ల ఉత్పత్తికి అనుకూలంగా బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ జాతిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ భాగస్వామ్యం ప్రాథమికంగా నాలేడ్జి షేరింగ్ కు సంబంధించనిదేనని, అవసరమైతే పరస్పర సహకారంతో ఆర్థిక మద్దతు కూడా అందించే అవకాశం ఉంటుందని అవగాహన ఒప్పందంలో పేర్కొన్నారు.
సాంప్రదాయేతర ఉపాధీ రంగాల్లో మహిళలకు ఆదాయ వనరులను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం-మంత్రి సీతక్క
గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు పశుసంవర్ధక రంగం బలమైన ఆధారం. స్వయం సహాయక సంఘాల మహిళలు సంప్రదాయ ఉపాధికి పరిమితం కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఆదాయ వనరులు పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సెర్ప్, పీవీఎన్‌ఆర్‌టీయూ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ మహిళలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ, మార్కెట్ అవగాహన అందుతుంది. ఇది మహిళల ఆదాయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ కుటుంబాల పోషక భద్రతను కూడా బలోపేతం చేస్తుంది.






