- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోదారులు చూపు.. టీజీ రెడ్ కో కీలక నిర్ణయం
విద్యుత్ వాహనాల కోసం ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్‌ల సంఖ్యను గణనీయంగా పెంచాలని టీజీ రెడ్కో భావిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ వాహనాల కోసం ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్‌ల సంఖ్యను గణనీయంగా పెంచాలని టీజీ రెడ్కో భావిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ మూడు కిలోమీటర్లకు ఒక ఈవీ స్టేషన్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెడ్కో, ప్రైవేట్‌వి కలుపుకుని కేవలం 870 వరకు మాత్రమే ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిసింది. 2030 నాటికి వీటి సంఖ్యను 6 వేల వరకు పెంచాలని టీజీ రెడ్కో టార్గెట్ పెట్టుకున్నది. రాజధాని హైదరాబాద్‌తో పాటు ముఖ్యమైన పట్టణాల్లో కాలుష్యం భారీగా పెరుగుతున్నందున వాహన కాలుష్యం తగ్గించేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈవీ చార్జింగ్స్టేషన్లు పెట్టేందుకు సరిపడా స్థలాలు వుంటే చాలు. వారితో పెట్టించేందుకు రెడ్ కో ప్రయత్నాలు చేస్తున్నది.పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) మోడ్‌లోనే వీటిని పెట్టించాలని చూస్తున్నది. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను త్వరలో స్టాండింగ్ కమిటీ ముందుంచి ఆమోదిస్తామని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం నగరంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అవసరం ఎక్కువగా ఉన్న చోట వాటి సంఖ్యను రెట్టింపు చేయనున్నారు.
గ్రేటర్‌లోని ప్రధాన సెంటర్లలో..
ఇన్‌కమ్ షేరింగ్‌లో భాగంగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు టీజీఆర్ఈడీసీఓ (తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), జీహెచ్ఎంసీల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 250వరకు ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని మెట్రో రైల్ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లు, సాధారణ పెట్రోల్ బంక్‌ల సమీపంలో ఏర్పాటుచేశారు. రాబోయే రోజుల్లో ఇందిరా పార్క్, కేబీఆర్ పార్క్ గేట్-1, గేట్-3, గేట్-6, ట్యాంక్ బండ్ రోడ్, అబిడ్స్ మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్స్, నానక్ రాంగూడ, వనస్థలిపురంలోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, ఉప్పల్ మెట్రోస్టేషన్ పార్కింగ్, సంతోష్ నగర్ (ఓవైసీ హాస్పిటల్), సికింద్రాబాద్ తాజ్ త్రిస్టార్ హోటల్ సమీపంతో పాటు మరిన్ని ప్రాంతాల్లో ఈవీ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని టీజీ రెడ్కో భావిస్తోంది.
కొత్తగా 300 చోట్ల ఈవీ స్టేషన్లు..
పెరుగుతున్న ఇంధన ధరలు, వాతావరణ కాలుష్యం వంటి కారణలతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోదారులు మొగ్గుచూపుతున్నారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనాలు కనుక పెట్రోల్‌కు డబ్బులు పెట్టే అవసరం ఉండదు. అందుకే వీటి వినియోగించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై సబ్సిడీ ఇస్తున్నది. అందుకే ఈవీ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లు కీలకం అవుతున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి నిర్ణీత కిలోమీటర్ల వరకు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. చార్జింగ్ ఐపోతే తిరిగి దాన్ని మరల రీచార్జి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని 300 ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో చాలా చోట్లల్లో ఏర్పాటు చేయనున్నారు.
50 గజాల స్థలంతో పాటు ఆసక్తి ఉంటే..
ప్రస్తుతం తెలంగాణలో 1.26 లక్షల విద్యుత్ వాహనాలు వున్నాయి. వీటి కోసం బహిరంగ ప్రదేశాల్లో 621 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, మిగతా 249 టీజీ రెడ్కో తన సొంత వ్యయంతో ఏర్పాటు చేయించింది. అయితే, 50 గజాల స్థలం ఉన్న వారు ఎవరైనా వీటిని ఏర్పాటు చేసుకుంటే మంచి ఆదాయ వనరు అవుతుందని టీజీ రెడ్కో అధికారులు చెబుతున్నారు. కాగా, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు తమ నుంచి ఎన్వోసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని టీజీ రెడ్కో తెలియజేస్తున్నది. రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో ప్రతి మూడు కిలో మీటర్లకు ఒక విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను పెట్టించాలని భావిస్తున్నందున ఆసక్తి గలవారి కోసం రెడ్ కో అధికారులు ఎదురుచూస్తున్నట్లు తెలిసింది.






