ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రవాణా కష్టాలకు చెక్ పెట్టేలా కామన్ టికెటింగ్

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ ప్రయాణికుల టికెట్ కష్టాలు తీర్చేలా ప్రభుత్వం కొత్త యాప్ ను తీసుకురానుంది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రవాణా కష్టాలకు చెక్ పెట్టేలా కామన్ టికెటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌ మహానగరంలోని ఎంఎంటీఎస్ రైలు, మెట్రో ట్రైయిన్, టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను పరస్పరం అనుసంధానిస్తూ సమగ్ర ప్రజారవాణా వ్యవస్థను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ ప్రణాళికను ప్రారంభించింది. ఎంఎంటీఎస్, మెట్రో, బస్సు సర్వీసులకు సంబంధించి కామన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రయాణికులకు మొదటి, చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడం, రహదారి రద్దీని తగ్గించడం, ప్రజారవాణా వినియోగాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, బస్సులకు సంబంధించిన కామన్ టికెట్‌ వ్యవస్థను సిద్ధంచేశారు. దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్, మొదటి, చివరి కనెక్టివిటిలో భాగంగా ప్రయివేటు రవాణా మార్గాలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలతో అనుసంధానం చేయడానికి ప్రయివేటు కన్సల్టెన్సీ నియామకానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు అధికారులు వెల్లడించారు.

రియల్ టైం డేటా..

కామన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఎంఎంటీఎస్, మెట్రోరైలు, బస్సులు, ప్రయివేటు రవాణా మార్గాలను సైతం ప్రయాణికులకు కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి సాఫ్ట్‌వేర్ రూపొందించాలని నిర్ణయించారు. ఈ కామన్ టికెట్ బుక్ చేయడానికి రవాణా మార్గాలకు సంబంధించిన రియల్ టైం డేటా పరిశీలించడానికి మొబైల్ యాప్ రూపొందించే ప్రక్రియను స్పీడప్ చేశారు. మూడు విభాగాలకు సంబంధించిన డేటాను యాప్ ద్వారా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ విభాగాలకు సంబంధించిన అధికారులు చర్చలు సైతం జరిపారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ..

పీపీపీ విధానంలో ఏర్పాటు చేసిన మెట్రోరైలు ఒప్పందంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామని ప్రస్తావించారు. కానీ, మెట్రోరైలు ప్రాజెక్టు, ఎల్ అండ్ టీ సంస్థ దీన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయింది. దీంతో పాటు అసలు ఎంఎంటీస్, మెట్రోరైలు, ఆర్టీసీ బస్సులకు ఎలాంటి అనుసంధానం కూడా చేయలేదు. కామన్ టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు నేపథ్యంలో లాస్ట్ మైల్ కనెక్టివిటికీ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ప్రైవేట్ ఫీడర్ సేవలు (షేరింగ్ వాన్లు/షటిల్‌లు) ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఇవి నిర్ణీత జోన్లలో పనిచేసి, జీపీఎస్ ద్వారా పర్యవేక్షించబడతాయి. ప్రతి ఎంఎంటీఎస్ స్టేషన్‌కు సమీపంలోని బస్‌స్టాప్‌లు, మార్గాలను మ్యాపింగ్ చేసి స్టేషన్ వారీ అనుసంధాన ప్రణాళికను రూపొందించాలని టీజీఎస్‌ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీలకు సూచించారు.

త్వరలోనే టెండర్లు..

కామన్ టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు, మొబైల్ యాప్, రియల్ టైం డేటా అందించడానికి ప్రత్యేకంగా కన్సల్టెన్సీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. రెండు నెలల్లో కామన్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Next Story