- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి హెచ్ఎండీఏ మెగా వేలం.. రూ.2,500 కోట్ల ఆదాయమే లక్ష్యం!
మరోసారి ప్లాట్లు, భూముల వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. కోకాపేట్ లోని నియోపొలిస్ లేఅవుట్ లోని ప్లాట్ల వేలంతో రూ.3,800 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్న హెచ్ఎండీఏ ఈ సారి రూ.2,500కోట్ల ఆదాయమే లక్ష్యంగా వేలానికి సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మరోసారి ప్లాట్లు, భూముల వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. కోకాపేట్ లోని నియోపొలిస్ లేఅవుట్ లోని ప్లాట్ల వేలంతో రూ.3,800 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్న హెచ్ఎండీఏ ఈ సారి రూ.2,500కోట్ల ఆదాయమే లక్ష్యంగా వేలానికి సిద్ధమైంది. మొత్తం 168 ప్లాట్లు, 8.24ఎకరాల భూముల వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను గురువారం జారీ చేసింది.
మోకిలాలో 100 ప్లాట్లు..
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిల్లా లేఅవుట్ లోని 100 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. ఈ లేఅవుట్లో ప్లాట్ కనిష్ట విస్తీర్ణం 300 చదరపు గజాలు, గరిష్ట విస్తీర్ణం 500 చదరపు గజాలుగా ఉంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మేడిపల్లి లేఅవుట్ లో 68 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో ప్లాట్ కనిష్ట విస్తీర్ణం 231 చదరపు గజాలు, గరిష్ట విస్తీర్ణం 643 చదరపు గజాల్లో ఉన్నాయి. దీంతోపాటు హైదరాబాద్ జిల్లా షేక్ పేట్ మండలంలోని హాకీంపేటలో 8.24 ఎకరాల భూమి వేలానికి సైతం వేలం వేయనున్నారు.
భూముల వేలం ఇలా..
లేఅవుట్ లోని ప్లాట్లతోపాటు ఆయా ప్రాంతాల్లోని ల్యాండ్ పార్శిళ్లకు సైతం వేలం నిర్వహించనున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్ సర్వే నెంబర్ 174లోని 484 చదరపు గజాల భూమి, గండిపేట మండలం బైరాగిగూడలోని సర్వే నెంబర్ 57లోని 2,420 చదరపు గజాల భూమి, నార్సింగి ప్రాంతంలోని సర్వే నెంబర్ 105లో ఉన్న 5,687 చదరపు గజాల భూమి పార్శిళ్లు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గండిమైసమ్మ మండలం భౌరంపేట గ్రామంలోని సర్వే నంబర్ 694లో ఉన్న 2,420 చదరపు గజాల భూమి, కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం గ్రామంలోని సర్వే నెంబర్ 166, 167లో ఉన్న 4,840 చదరపు గజాల భూమి, మేడిపల్లి మండలంలోని పీర్జాదిగూడలోని సర్వే నెంబర్ 199లో ఉన్న 2,057 చదరపు గజాల భూమి, 726 చదరపు గజాల భూమి పార్శిళ్లకు వేలం వేయనున్నారు.
రూ.2,500కోట్ల ఆదాయం..
మోకిలా లేఅవుట్ లోని 100 ప్లాట్లు, మేడిపల్లి లేఅవుట్ లోని 68 ప్లాట్ల విక్రయం ద్వారా రూ.400 కోట్లు, హాకీంపేటలోని 8.24 ఎకరాల విక్రయం ద్వారా రూ.1,600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని భూముల పార్శిళ్ల విక్రయం ద్వారా రూ.500 కోట్లు ఆదాయం, మొత్తం రూ.2,500కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. అయితే గతంలో కోకాపేట్ నియోపొలిస్, గోల్డ్ మైన్ లేఅవుట్లలో ప్లాట్ల వేలం ద్వారా రూ.3,800 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
వేలం షెడ్యూల్ ఇలా..
ప్లాట్లు, భూముల వేలానికి సంబంధించిన షెడ్యూల్ ను హెచ్ఎండీఏ జారీ చేసింది. ఆయా భూమి పార్శిళ్లకు జూన్ 15 రిజిస్ట్రేషన్ తోపాటు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. 17వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు వేలం నిర్వహించనున్నారు. హకీంపేట్ భూమికి జూన్ 17 రిజిస్ట్రేషన్, 19న వేలం, మేడిపల్లి లేఅవుట్ లోని 68 ప్లాట్లకు 22వ తేదీ రిజిస్ట్రేషన్, 24వ తేదీన వేలం, మోకిలా లేఅవుట్ కు 27వ తేదీన రిజిస్ట్రేషన్, 29వ తేదీన వేలం వేయనున్నారు.






