BRS: కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసుల వేళ తెరపైకి బీఆర్ఎస్ కొత్త వ్యూహం

by Prasad Jukanti |   (  Updated:2025-05-31 09:24:44  IST  )

కాళేశ్వరంపై మరోసారి బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించడం ఆసక్తిగా మారింది.

BRS: కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసుల వేళ  తెరపైకి బీఆర్ఎస్ కొత్త వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వచ్చే నెల 5వ తేదీన కేసీఆర్ ను విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం (Kaleswaram) కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఅర్ఎస్ (BRS) పార్టీ నయా స్ట్రాటజీ కి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. నోటీసుల నేపథ్యంలో ఇప్పటికే పలు సార్లు కేసీఆర్ (KCR), హరీశ్ రావు భేటీ అయి చర్చలు జరిపిన వేళ ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ప్రాజెక్టుపై తెలంగాణ భవన్ లో పీపీటీ ఇవ్వబోతున్నట్లు మధుసూదనాచారి తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన మధుసూదనాచారి ఈ విషయం వెల్లడించారు. అయితే కేసీఆర్ విచారణకు హాజరు కావడం కంటే ముందు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు గులాబీ పార్టీ రెడీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

మరోవైపు నిరసనలు:

హరీశ్ రావు చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్న వేళ మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో జూన్ 4వ తేదీన ఇందిరాపార్కు వద్ద జాగృతి అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కేసీఆర్ కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ సరిగ్గా స్పందించలేదని ఆరోపించిన కవిత జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దీంతో ఓ వైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరో వైపు కవిత నిరసనకు ప్లాన్ చేస్తున్న వేళ ఇటువంటి పరిస్థితులలో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది.

తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్:

బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతోందని కవిత (Kavitha) ఆరోపణలు చేసిన నేపథ్యంలో మధుసూదనాచారి స్పందించారు. కేసీఆర్ ఆలోచనలు నాకు తెలుసు జరిగిన పరిణామాలు మాకు ఎక్కువ తెలుసు. పార్టీలో ఏ నిర్ణయం అయినా కేసీఆర్ తీసుకుంటారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎట్టిపరిస్థితుల్లో భంగం కలగదు. బీజేపీలో బీఆర్ఎస్ కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు చేస్తున్నాయి. వారి ప్రచారాన్ని ఖండిస్తున్నాను. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగితే ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారన్నారు. తెలంగాణ అంటే నక్సలైట్లు అన్న సందర్భంలో కేసీఆర్ పార్టీని పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. చంద్రబాబు, వైఎస్ఆర్ వంటి ఇద్దరు బలమైన నాయకులను కేసీఆర్ ఎదుర్కొన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని బాలహీనపర్చాలనే కుట్ర చేస్తున్నారని కానీ తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్,బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవన్నారు. తెలంగాణను సాధించి సీఎంగా రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని కేసీఆర్ సీఎంగా లేనందుకు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలన చర్చకు వస్తే కాంగ్రెస్, బీజేపీల రాజకీయ పునాదులు కదులుతాయన్నారు. పరిపాలనలో కాంగ్రెస్, బీజేపీ ప్రజల మెప్పు పొందాలన్నారు. కేంద్రమంత్రుల భాష, వారి పాలన ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

Next Story