- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ యువతే టార్గెట్‌గా డార్క్‌నెట్‌లో ఓజీ గంజాయి
మత్తును ఎక్కువగా ఇస్తున్న ఓజీ గంజాయిని సేవిస్తున్న మత్తురాయుళ్లు గంటల పాటు భ్రాంతిలో ఉంటూ విచిత్రంగా ప్రవర్తిస్తారని తెలిసింది.

దిశ, సిటీక్రైం : కాస్ట్లీ మత్తు బాబులు ఇప్పుడు సాధారణ గంజాయి కన్నా ఓజీ గంజాయి (హైడ్రో ప్రోనిక్ గంజాయి)కి అలవాటు పడుతున్నారు. ఈ ఓజీ గంజాయిలో మత్తును అధికంగా ఇచ్చే టెట్రాహైడ్రాకాన్నాబినోల్ పదార్థం 45 శాతం ఉండడంతో మత్తు బాబులు ఇప్పుడు దీని కోసం తాపత్రయం పడుతున్నట్లు తెలుస్తున్నది. సాధారణ గంజాయిలో ఈ పదార్థం 15 శాతం ఉండడంతో మత్తు సరిగా రావడం లేదని, అధికంగా సేవించాల్సి వస్తుందనే నెపంతో ఇప్పుడు మత్తుకు అలవాటు పడ్డ యువత ఈ ఓటీ గంజాయి వైపు మొగ్గు చూపుతున్నారని హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇలా మత్తు దునియాలో ఓజీ గంజాయికి డిమాండ్ భారీగా పెరగడంతో ఇప్పుడు ఈ ఓజీ గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారని పోలీసులు గుర్తించారు. సంపన్న వర్గాలకు చెందిన వారు, ఉన్నతవిద్యాభ్యాసం చేసిన వారందరూ ఈ ఓజీ గంజాయిని పీల్చడానికి పెద్ద మొత్తంలో డబ్బులను ఖర్చు చేస్తున్నట్లు ఇటీవల హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఎల్ఈడీ లైట్ల వెలుతురు వేడిలో పెంపకం..
ఈ ఓజీ గంజాయి (హైడ్రో ప్రోనిక్ గంజాయి) మట్టిలో కాకుండా నీళ్లలో పెంచుతారు. ఈ గంజాయి విత్తనాలను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసుకొని వాటిని ఓ గదిలో పెట్టి స్మగ్లర్లు పెంచుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇలా తెచ్చిన విత్తనాలను నీళ్లలో వేసి దాని చుట్టూ ఎల్ఈడీ లైట్ల వెలుతురు వేడిలో ఉంచి ఈ ఓజీ గంజాయిని పెంచుతారని పేర్కొంటున్నారు. ఇలా ఈ మొక్కలను పెంచడంతో ఇందులో మత్తును ఇచ్చే టెట్రాహైడ్రాకాన్నాబినోల్ పదార్థం 45 శాతం ఉండడంతో దీనిని సేవించగానే నిమిషాల వ్యవధిల్లోనే నషాలోకి జారుకుంటుండడంతో ఇప్పుడు మత్తుకు అలవాటు పడ్డవారు ఈ ఓజి గంజాయిని సేవించడానికి పెద్ద మొత్తంలో స్మగ్లర్ల వద్దకు పరుగులు పెడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
అంతా భ్రాంతి..
మత్తును ఎక్కువగా ఇస్తున్న ఓజీ గంజాయిని సేవిస్తున్న మత్తురాయుళ్లు గంటల పాటు భ్రాంతిలో ఉంటూ విచిత్రంగా ప్రవర్తిస్తారని తెలిసింది. వారు ఊహించింది కళ్ల ముందు అనుభవిస్తున్నట్లు భావించి ఈ ఓజీ గంజాయిని అధికంగా పీలుస్తున్నట్లు ఇటీవల హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ విద్యావంతులు వివరించినట్లు సమాచారం. సాధారణ గంజాయిలో అంతా కిక్కు ఇవ్వకపోవడంతో గ్రాముకు 2 నుంచి 3 వేల రూపాయాలు పెట్టి ఈ ఓజీ గంజాయిని కొనుగొలు చేస్తూ నషాలో తూగుతున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ ఓజీ గంజాయిని పీల్చి దాదాపు 6-8 గంటల పాటు భ్రాంతిలో ఉంటారని సమాచారం.
డార్క్ నెట్‌లో బుకింగ్..
ఈ ఓజీ గంజాయిని డార్క్ నెట్ ద్వారా బుకింగ్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులకు చిక్కిన నలుగురు యువకులు తెలిపారు. డార్క్ నెట్ ద్వారా ఈ ఓజీ గంజాయిని విక్రయించే వారి వివరాలను సేకరించి సిగ్నల్ యాప్, స్నాప్ చాట్ యాప్ ద్వారా ఆర్డర్ ఇస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ యాప్‌ల ద్వారా యూజర్ ఐడీలకు మాస్క్ వేయడంతో వారి ఆచూకీ దొరకడం అసాధ్యం. అదే విధంగా ఈ యాప్‌లలో ఒకసారి మెసేజ్ చేసిన తర్వాత దానిని సంబంధిత వ్యక్తి చూడగానే అది మాయమైపోతుంది. ఆ తర్వాత యాప్‌ను తనిఖీ చేసినా ఏం మెసేజ్ పెట్టామని ఎవరు తెలుసుకోలేరు. ఇలా ఈ ఓజీ గంజాయి సరఫరాకు మత్తుబాబులతో పాటు స్మగ్లర్లు ఈ యాప్‌లు, డార్క్ నెట్‌లను ఉపయోగిస్తున్నారని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
ట్రాకింగ్ లింక్‌తో అడ్రస్‌కు చేరుకోకముందే..
మత్తు బాబులు వారి ఆచూకీ పోలీసులకు తెలియకుండా ఉండేందుకు డార్క్‌నెట్, సిగ్నల్ యాప్, స్నాప్ చాట్ ద్వారా ఓజీ గంజాయికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత డెలివరీకి సంబంధించి వారు ఇచ్చిన చిరునామాకు రాకముందే దానిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకుంటున్నారు. దీని కోసం డార్క్‌నెట్, యాప్‌ల ద్వారా ఓజీ గంజాయి కోసం ఆర్డర్ ఇవ్వగానే స్మగ్లర్లు వాటిని కొరియర్‌లో బుక్ చేసి పంపిస్తున్నారు. కొరియర్‌లో బుక్ చేయగానే మత్తుబాబులకు ట్రాకింగ్ ఐడీ వస్తుంది. ఈ ట్రాకింగ్ ఐడీ ద్వారా పార్సిల్ ఎక్కడికి వచ్చిందని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇలా వారు నమోదు చేసిన చిరునామాకు కాకుండా స్థానిక కొరియర్ కార్యాలయానికి రాగానే ట్రాకింగ్ ఐడీ ద్వారా తెలుసుకొని మత్తు బాబులు నేరుగా ఆ కార్యాలయానికి వెళ్లి తీసేసుకుంటున్నారు. ఇలా మత్తు బాబులు వారి అడ్రస్సును ఎవర గుర్తించకుండా జాగ్రత్తలు పడుతున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
హవాలా లేదా క్రిప్టో కరెన్సీ రూపంలో..
మత్తు పదార్థాలపై పోలీసులు పంజా విసురుతుండడంతో స్మగ్లర్లు, మత్తురాయుళ్లు వారి ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఇప్పుడు మత్తు పదార్థాలను కొనుగోలు చేసేందుకు హవాలా లేదా క్రిప్టో కరెన్సీ చెల్లింపుల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఎక్కడా వారి ఆచూకీ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు ఈ మత్తు పదార్థాల కొనుగోలు కోసం ఆన్ లైన్ పేమెంట్లను ఉపయోగించారు. అయితే పోలీసులు తమ దర్యాప్తులో సాంకేతిక పరంగా అన్ని వివరాలను సేకరిస్తుండడంతో అది ప్రమాదకరంగా మారింది. దీంతో హవాలా, క్రిప్టో కరెన్సీలో చెల్లింపులను చేస్తే పోలీసులు వాటిని ఛేదించలేరని స్మగ్లర్లు, మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్న వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నయా రూట్‌ను ఛేదించారు. ఇలా సాంకేతికంగా గుట్టుగా ఓజీ గంజాయి దందాను సాగిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన హర్షవర్ధన్, చెన్నైకి చెందిన శ్రీనివాస్ రాహూల్, హైదరాబాద్‌కు చెందిన అభిషేక్, ధవాల్‌ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, హెచ్-న్యూ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో పోలీసులు ఇప్పుడు ఈ దందాతో లింక్ ఉన్న హవాలా రాకెట్‌ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా గాలిస్తున్నారు.






