HYD: నాలుగు AC స్లీపర్ బస్సులు సీజ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-25 16:30:47  IST  )

కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 20 మంది ప్రాణాలు బలితీసుకున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల తీరు మారడం లేదు.

HYD: నాలుగు AC స్లీపర్ బస్సులు సీజ్
X

దిశ తెలంగాణ బ్యూరో: కర్నూలులో ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 20 మంది ప్రాణాలు బలితీసుకున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల తీరు మారడం లేదు. అధికారులు తనిఖీలు చేపడుతున్నారని అధికారికంగానే తెలిసినా కూడా నిబంధనలను ఉల్లంఘిస్తూనే బస్సులు నడుస్తున్నాయి. ఇది శనివారం నాడు అధికారులు చేపట్టిన తనిఖీల్లో తేటతెల్లం అయింది. ప్రయాణికుల భద్రతను కాదని నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్‌ స్లీపర్‌ ఏసీ బస్సులపై రవాణా శాఖ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో జరిగిన తనిఖీల్లో మొత్తం 68 వాహనాలపై వీసీఆర్‌లు (వెహికల్ చెకింగ్ రిపోర్ట్) జారీ చేసి రూ.1.17 లక్షల కాంపౌండింగ్‌ ఫీజు వసూలు చేశారు.

తనిఖీల్లో ఫైర్‌ ఎక్స్టింగ్విషర్లు (అగ్నిమాపక యంత్రం), ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌లు లేకపోవడం, డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం, అనుమతులను దుర్వినియోగం చేయడం, మల్టీటోన్‌ హార్న్‌లు వాడటం, ప్రయాణికుల వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా సరుకులు రవాణా చేయడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో నాలుగు బస్సులను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌లో 23, రంగారెడ్డి జిల్లాలో 14, సౌత్‌ జోన్‌లో 9, వెస్ట్‌ జోన్‌లో 9, ఈస్ట్‌ జోన్‌లో 6, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో 7 వీసీఆర్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రైవేట్‌ ట్రావెల్‌ ఆపరేటర్లు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని రవాణా శాఖ హెచ్చరించింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పేర్కొన్నారు.

అక్రమంగా ఆరు సీట్లు పెంచేశారు...

రవాణా శాఖ తనిఖీల్లో టఎస్ 12 యూఈ 1236 నంబర్‌ ఉన్న ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులో అనుమతించబడిన 23 సీట్లకు బదులుగా 29 సీట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అనుమతి లేకుండా 6 సీట్లు అదనంగా అమర్చినందుకు వెంటనే చర్యలు తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాదిలో 877 బస్సుల సీజ్

ప్రయాణికుల భద్రతను కాదని నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్న ప్రైవేట్‌ స్లీపర్‌ ట్రావెల్స్‌ బస్సులపై రవాణా శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుండి అక్టోబర్‌ 25 వరకు జరిపిన తనిఖీల్లో 8,848 కేసులు నమోదు చేసి, 877 బస్సులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడిపిన ట్రావెల్స్‌ సంస్థల నుండి అధికారులు రూ.2.28 కోట్లు కాంపౌండింగ్‌ ఫీజు, రూ.14.68 కోట్లు పన్నులు, జరిమానాల రూపంలో వసూలు చేశారు. మొత్తం వసూళ్లు రూ.16.96 కోట్లు అని జేటిసి రమేష్ తెలిపారు.

Next Story