Hyderabad Metro: మెట్రో రైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డి

by Prasad Jukanti |

మెట్రో రైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Hyderabad Metro: మెట్రో రైల్ ఎండీగా మళ్లీ ఎన్వీఎస్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆయా శాఖల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులను ఇటీవల ఉద్వాసన పలికిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు ఎండీగా ఎన్వీఎస్ రెడ్డికి (NVS Reddy) తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రో (Hyderabad Metro) రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకాలం హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), హెదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీగా (Metro MD) కీలకంగా వ్యవహరించిన ఎన్వీఎస్ రెడ్డి సేవలను మరికొంత కాలం కొనసాగించడం సముచితం అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మరో ఏడాది పాటు ఎన్వీఎస్ రెడ్డిని హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ ను కీలకంగా భావిస్తోంది. ఓల్డ్ సిటీ, ఎయిర్ పోర్టు, ఫోర్త్ సిటీ, నార్త్ సిటీ వంటి ప్రాంతాలకు సైతం మెట్రో నడిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్ట్ -ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ -బీ కింద 3 కారిడార్లను ప్రతిపాదించగా ఇందులో పార్ట్-ఏ లోని 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ఎను 5 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి పంచింది. ఈ డీపీఆర్ కు అనుమతులు వస్తే పనులను వేగంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి కీలకంగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డి సేవలు తప్పనిసరి అని ప్రభుత్వం భావించింది.

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రీ అపాయింట్మెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో కొనసాగుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్వాసన పలికింది. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో 177 మందిని పంచాయతీ రాజ్ శాఖలో 47 మందిని తొలగించింది.

Next Story