Seethakka: ఐసీడీసీ ప్రాజెక్టులకు మంత్రి సీతక్క నిధులు.. ఈ నెల 17 నుంచి పోషణ కార్యక్రమాలు

by Prasad Jukanti |

పోష‌ణ మాసం నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు మంత్రి సీతక్క లేఖలు రాశారు.

Seethakka: ఐసీడీసీ ప్రాజెక్టులకు మంత్రి సీతక్క నిధులు..  ఈ నెల 17 నుంచి పోషణ కార్యక్రమాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగ‌న్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేర‌వేసేలా కార్యాచరణ సిద్దం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు సీతక్క లేఖలు పంపారు. పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వారు చురుకుగా పాల్గొనాలని, తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం మొద‌టి అడుగు అయిన నేపథ్యంలో, ప్రతి ఇంటిలో పోషణపై చైతన్యం కల్పించడమే ఈ మాసం ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ICDS ప్రాజెక్టుకు రూ.30,000, ప్రతి జిల్లాకు రూ.50,000 నిధులను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నిధులను ఉపయోగించి గ్రామస్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ పోషణ మాసం సందర్భంగా చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించేందుకు, అలాగే చక్కెర, ఉప్పు, నూనె వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో సక్రమమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు అంగన్‌వాడీ కార్యకర్తల స‌హ‌కారంతో ప్రతి ఇంటికీ పోషణ సందేశం తీసుకెళుతామ‌న్నారు.

పోషణ మిషన్‌లో పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా కుటుంబాల్లో పోషకాహారంపై సమగ్ర అవగాహన కలిగించాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశ‌మ‌ని మంత్రి సీత‌క్క వివరించారు. “వోకల్ ఫర్ లోకల్” నినాదంతో గ్రామీణ స్థాయిలో ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించి ఆత్మనిర్భరతను పెంచే కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో గ్రామస్థాయిలోనూ పోషణ డేటాను సేకరించి, వాటిపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపడతామని వెల్లడించారు.

పోషణ మాసం కాలంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, "పోషణ తెలంగాణ‌ నిర్మాణం మనందరి బాధ్యత. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబంలో ఈ చైతన్యం పెంపొందాలి. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసి, ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తాం" అన్నారు. పోష‌ణ మాసంలో భాగంగా ప్రతి రోజు చేపట్టాల్సిన కార్యక్రమాల వివ‌రాల‌ను సిద్ధం చేసి జిల్లాల‌కు పంపించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా చురుకైన పాత్ర వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పోషిత, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో ఈ పోషణ మాసం కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story