- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సరీ @ రూ.1 లక్ష! పాలమూరు జిల్లాలో కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ హద్దు అదుపు లేకుండా సాగుతోంది.

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ హద్దు అదుపు లేకుండా సాగుతోంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోచుకునేందుకు ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌తో పాటు జడ్చర్ల, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి వంటి పట్టణాలలో ఈ ఏడాది ‘నేషనల్’, ‘ఇంటర్నేషనల్’ బోర్డుల పేరిట కుప్పలు తెప్పలుగా కొత్త పాఠశాలలు వెలిశాయి. పోటీ పెరిగితే ఫీజులు తగ్గుతాయని ఆశించిన సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల అంచనాలను తలకిందులు చేస్తూ విద్యాసంస్థల నిర్వాహకులు భారీ ఎత్తున ఫీజులు నిర్ణయించి వసూళ్లకు తెగబడుతున్నారు.
నర్సరీ చదువుకే.. అక్షరాలా లక్ష!
కొత్తగా ఏర్పాటైన కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థల్లో నర్సరీలో చేరే చిన్నారికి సైతం అక్షరాలా లక్ష ఫీజును నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ఫీజు మాత్రమే లక్ష వసూలు చేస్తూ.. పుస్తకాలు, నోటు పుస్తకాలు, దుస్తులు, ఇతర సామాగ్రి పేరిట మరో రూ.30 వేల నుంచి రూ. 50 వేల రూపాయల వరకు గుంజుతున్నారు. ఇటు సాధారణ ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా విద్యా ఫీజు రూ. 50,000, బస్సు ఫీజు రూ. 20,000, పుస్తకాలు, ఇతర సామాగ్రి అంతా కలిపి ఏడాదికి లక్ష రూపాయలకు పైగానే వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
ఒకరిని మరొకరు దెబ్బ తీసుకునేలా..
ఈ విద్యా వ్యాపారంలో తమకు అడ్డు రాకుండా ఉండేందుకు కొందరు కార్పొరేట్ నిర్వాహకులు సిండికేట్‌గా మారినట్లు సమాచారం. విద్యాశాఖలోని కొందరు అధికారులతో చేతులు కలిపి, తమకు వ్యతిరేకంగా ఉన్న చిన్న పాఠశాలల లోపాలను వెలికితీసి వాటిని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇదే అదునుగా భావించి కొన్ని సంఘాల ప్రతినిధులు, అధికారులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అక్రమ విద్యా వ్యాపారం జరుగుతున్నా, అటు పాలకులు గానీ, ఇటు అధికార యంత్రాంగం గానీ కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
తల్లిదండ్రులను బోల్తా కొట్టేలా ప్రచారాలు..
తల్లిదండ్రులను, విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు రంగురంగుల బ్రోచర్లు, భారీ ఫ్లెక్సీలతో విస్తృత ప్రచారాలు సాగిస్తున్నాయి. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనుకాడకూడదనే తల్లిదండ్రుల బలహీనతను ఈ సంస్థలు పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ పాఠశాలల ప్రాంగణాల్లోనే పుస్తకాలు, దుస్తుల విక్రయాలు జరుపుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందించి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.






