పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-27 01:27:46  IST  )

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్‌ నేడు విడుదల కానున్నది.

పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్‌ నేడు విడుదల కానున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా స్థాయిలో కలెక్టర్‌లు, గ్రామ పంచాయతీల స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్లు నోటిఫికేషన్​విడుదల చేయనున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనాభా ఆధారంగా రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్​అధికారిని నియమించారు. వీరు నేటి నుంచి ఎల్లుండి వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు పూర్తి చేశారు.

రూ.2 వేలు డిపాజిట్

21 ఏండ్ల వయస్సు ఉన్న వారు, అదే గ్రామంలో ఓటరుగా నమోదైన వారు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు. సర్పంచ్‌ స్థానానికి నామినేషన్ వేసేవారు (జనరల్) రూ.2వేలు డిపాటిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.వెయ్యి డిపాజిట్​కింద చెల్లించాలి. వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు (జనరల్) రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250 డిపాజిట్ చెల్లించాలి.

ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అర్హులే

ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. డిసెంబర్​3న బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్​11న పోలింగ్​జరగనుంది. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​రాణి కుముదిని, కార్యదర్శి మకరంద్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్షించారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాల్లో ఎన్నికల కోడ్​అమలయ్యేలా చూడాలని సూచించారు. మోడల్​కోడ్ కండక్ట్​ (ఎంసీసీ) కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎంసీసీ పకడ్బందీగా అమలయ్యే విధంగా చూడాలన్నారు. కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేయాలన్నారు. నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల పరిశీలకులు సైతం అందుబాటులో ఉంటారని తెలియజేశారు. వీరి వివరాలను ప్రజలకు అందిస్తే ఎన్నికల కోడ్​ఉల్లంఘన, ఇతర అంశాలపై వారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగే విధంగా ఓటర్లు, రాజకీయ పార్టీలు సహకరించాలని రాణికుముదిని కోరారు.

Next Story