- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు గ్రామాల్లో నామినేషన్లు నిల్.. 133 వార్డుల్లోనూ అదే పరిస్థితి
రాష్ట్రంలో మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రామాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రామాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇందులో మంచిర్యాల జిల్లాలో మూడు గ్రామాలు ఉండగా, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కో గ్రామం చొప్పున ఉన్నది. ఇంకా 133 వార్డులకు కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానట్టు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఇందులో మంచిర్యాల జిల్లాలో 34 వార్డులు, ఆసిఫాబాద్ జిల్లాలో 30, జనగామమలో 10, వికారాబాద్ లో 19, గద్వాలలో 9, నిర్మల్ లో ఏడు, ములుగులో నాలుగు, ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో మూడు చొప్పున, భువనగిరి, మెదక్, ఖమ్మం జిల్లాల్లో రెండు చొప్పున, సూర్యాపేట, జగిత్యాల, వనపర్తిలో ఒక్కొక్కటి చొప్పున వార్డులు ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల సమస్యల తలెత్తడంతోనే నామినేషన్లు దాఖలు కానట్టు తెలుస్తున్నది. మరోవైపు గ్రామంలో పది మంది కూడా లేని సామాజిక వర్గానికి సర్పంచ్ పదవి రిజర్వ్ చేయడంపై మిగిలిన వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. దీంతోపాటు గ్రామంలోని సమస్యలు పరిష్కరించలేదని నిరసిస్తూ కొన్ని గ్రామాల్లో నామినేషన్లు దాఖలు చేయలేనట్టు తెలిసింది. కాగా, మొదటి విడతలో 4,236 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ ఇవ్వగా, 4,231 గ్రామాలకు 22,330 నామినేషన్లు దాఖలయ్యాయి. 37,440 వార్డులకు నోటిఫికేషన్ విడుదల కాగా, 133 వార్డులకు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. వార్డు సభ్యులకు 85,428 మంది పోటీ పడుతున్నారు. ఈనెల 3 వరకు ఉపసంహరణ గడువు ఉండగా.. అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.
రెండో విడతలో...
సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో సోమవారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం 10 గంటల నుంచే నామినేషన్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. వార్డు, సర్పంచ్ అభ్యర్థులు, వారిని బలపరిచే వారు, మద్దతుదారులతో నామినేషన్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే కోలాహలం నెలకొంది. గ్రామాలు సందడిగా మారాయి.






