Supreme Court: వక్ఫ్ చట్టంపై విచారణ వాయిదా

by Prasad Jukanti |   (  Updated:2025-04-17 10:07:31  IST  )

వక్ఫ్ చట్టంపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు వారం గడువు ఇచ్చింది.

Supreme Court: వక్ఫ్ చట్టంపై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం (Waqf Act) ప్రకారం వక్ప్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్రాన్ని ఆదేశించింది. కొత్త చట్ట ప్రకారం బోర్డులో కొత్త నియామకాలు చేపట్టవద్దని వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ స్టేటస్ కో వింధించింది. వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రెండో రోజు గురువారం కూడా పసుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషన్ల సందేహాలను నివృత్తి చేసేందుకు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయమని, కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల పాటు గడువు కావాలని ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకరిస్తూ కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల అవకాశం ఇచ్చింది. ఈలోగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు బోర్డులలో ఎటువంటి నియామకాలు ఉండకూడదని స్పష్టం చేసింది. 2025 వక్ఫ్ (సవరణ) చట్టంలోని సెక్షన్ 9 మరియు 14 ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లేదా రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరులను నియమించవద్దని సీజేఐ మధ్యంతర ఉత్తర్వుల్లో నమోదు చేశారు. తదుపరి విచారణను ధర్మాసనం మే 5వ తేదీకి వాయిదా వేసింది.

Next Story