‘వీబీజీ రామ్ జీ వద్దు.. గాంధీజీ ముద్దు’ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

by Ramesh Naini |

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం కాంగ్రెస్ నిరసన ర్యాలీలు చేపట్టింది. ఏఐసీసీ పిలుపులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 'వీబీ జీ రామ్ జీ' పథకంగా పేరు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపింది.

‘వీబీజీ రామ్ జీ వద్దు.. గాంధీజీ ముద్దు’ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం కాంగ్రెస్ నిరసన ర్యాలీలు చేపట్టింది. ఏఐసీసీ పిలుపులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి (VB-G RAM G) 'వీబీ జీ రామ్ జీ' పథకంగా పేరు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహల వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నాగర్‌కర్నూల్ జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన నిరసనలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల -గాంధీచౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ గ్రామానికి వెళ్లిన గాంధీ మహాత్ముడు దర్శనమిస్తారని అన్నారు. ఆ నాడు ప్రతి పల్లెల్లో గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను పెట్టుకొని ఆరాధించారని తెలిపారు. దేశం కోసం సర్వం త్యాగం చేసి స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి గాంధీ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు.

సోనియా గాంధీ అనంతపురం పర్యటనలో ఉపాధి కోసం వలసలు చూసి చలించిపోయి మన్మోహన్‌తో చర్చించి ఉపాధి పథకం తీసుకొచ్చారని గుర్తుకు చేశారు. 2014 లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కులం మతం పేరిట రాజకీయం చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇప్పటివరకు 24 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా? వచ్చే ఉద్యోగాల మాట దేవుడు ఇరుగు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. ‘వీబీజీ రామ్ జీ వద్దు.. గాంధీజీ ముద్దు’ అని మహేశ్ కుమార్ గౌడ్ నినాదాలు చేశారు.

Next Story