- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమోషన్ల కోసం వేచి చూస్తూ పదవీ విరమణ!
పాఠశాల విద్యాశాఖలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల (జీహెచ్ఎం) పదోన్నతులు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందడం లేదు.

దిశ , హైదరాబాద్ బ్యూరో : పాఠశాల విద్యాశాఖలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల (జీహెచ్ఎం) పదోన్నతులు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందడం లేదు. పాఠశాలల్లో పని చేస్తున్న ఇతర ఉపాధ్యాయులకు ఇంచార్జి హెడ్మాస్టర్ గా బాధ్యతలు అప్పగించడంతో వారు ఒకవైపు బోధన, మరోవైపు పాఠశాల అడ్మినిస్ట్రేషన్ చేయలేక ఇబ్బందుల పాలవుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు గ్రేడ్ 2 హెడ్మాస్టర్లుగా పదోన్నతులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఫైల్ ను సిద్ధం చేసిన ప్రతిసారీ తమకు బదిలీలు జరిపిన తర్వాతే మిగిలిన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు నిరసన చేపట్టడం, కోర్టులకు వెళ్తామని బెదిరించడం విద్యాశాఖకు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నది. దీంతో వందలాది మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు లేకుండానే ఉద్యోగ విరమణ చేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతున్నది.
ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో బాధ్యతలు..
రెగ్యులర్ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) లేని చోట్ల ప్రధానాపాధ్యాయులకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పాఠశాలకు రాకపోవడంతో వాటిల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉండడంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఒక దశాబ్ద కాలంగా పీటముడిపడిన ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత సమర్థవంతంగా నిర్వహించడం, తద్వారా ఉపాధ్యాయుల అభిమానాన్ని సీఎం చూరగొన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతుల్లో మిగిలిపోయిన, విరమణ చేసిన 750 పైచిలుకు పాఠశాలలకు వెంటనే ప్రధానోపాధ్యాయులను నియమించాలని గత సంవత్సరం ఆగస్టు మాసంలో అధికారులు నిర్ణయం తీసుకొని చకచకా ప్రభుత్వ అనుమతులు పొందారు. కానీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులే శత్రువు అనే నానుడి నిజం చేస్తూ కొంత మంది మరొక్క రోజులో ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ను నిలిపివేశారు.
స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతుల నిర్ణయం పెండింగ్..
పాఠశాలల్లో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2023 సెప్టెంబర్ లో మల్టీజోన్ 1, 2024 జూన్ లో మల్టీజోన్ 2లో పదోన్నతి పొందిన హెడ్మాస్టర్లు తమకు బదిలీలు కల్పించిన తర్వాతే పదోన్నతులు ఇవ్వాలని, లేని పక్షంలో పదోన్నతుల ప్రక్రియ నిలిపివేయాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో జీహెచ్ఎం 2లుగా అర్హులైన వారికి ఇచ్చే పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేదం విధించినప్పటికీ, కనీసం రెండు సంవత్సరాలు ఒకే చోట పని చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ పదోన్నతులు పొందిన హెడ్మాస్టర్లు పట్టించుకోకుండా తమ సొంత లాభం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడడంపై పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారు మండిపడుతున్నారు. రెండేళ్ల సర్వీస్ కూడా లేని ప్రధానోపాధ్యాయుల బ్లాక్ మెయిలింగ్ విద్యాశాఖకు తలనొప్పులు తెచ్చిపెడుతుందని, తమకు అర్హత లేదని తెలిసి కూడా బదిలీలు జరపాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వాన్ని సవాలు చేస్తుండడాన్ని జీహెచ్ఎం గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టులో జీహెచ్ఎం పదోన్నతుల ప్రక్రియ వెబ్ ఆప్షన్ల వరకు అర్ధాంతరంగా నిలిచిపోవడం గమనార్హం. 2023 సెప్టెంబర్ నెలలో ప్రమోషన్లు ఇచ్చిన సమయంలో ఒక జీహెచ్ఎం క్యాడర్ లోనే నాన్ జాయినింగ్/లెఫ్ట్ ఓవర్ ఖాళీలు ఏర్పడినప్పటికీ అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వలేదు. దీంతో 24 సంవత్సరాలుగా ఒకే క్యాడర్ లో పని చేస్తున్న తమకు గ్రేడ్ 2 జీహెచ్ఎం గా పదోన్నతులు కల్పించాలని, అర్హులైన స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ప్రమోషన్లు కల్పించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రమోషన్ మా హక్కు..
బదిలీ అనేది సౌకర్యం. ప్రమోషన్ అనేది మా హక్కు. గతంలో పలుమార్లు బదిలీలు లేకుండా పదోన్నతులు కల్పించారు. కొన్ని సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా, రెండు సంవత్సరాలు ఒకే దగ్గర పూర్తి కాకుండా బదిలీలకు డిమాండ్ చేయడం అన్యాయం. బదిలీలు జరిగేదాకా ప్రమోషన్లు ఇవ్వకూడదనడం అనైతికం. చాలా మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు పొందకుండానే ఉద్యోగ విరమణ చేయడం బాధాకారం. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండడంతో ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించాలి.
- ఎండీ నజీమొద్దీన్, స్కూల్ అసిస్టెంట్






