- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు లేవు.. కానీ లక్షల్లో ఫీజులు! సీబీఎస్ఈ పేరుతో దోపిడీ?
మధ్యతరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రుల కలలను ఆసరాగా చేసుకున్న కొన్ని పాఠశాలలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే శ్రీ చైతన్య టెక్నో పేరుతో అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ నల్లగొండ బ్యూరో: మధ్యతరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రుల కలలను ఆసరాగా చేసుకున్న కొన్ని పాఠశాలలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే శ్రీ చైతన్య టెక్నో పేరుతో అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న సామెత చందంగా ఈ పాఠశాల సామాన్య తల్లిదండ్రులను నిలువునా దోచేస్తుందని చెప్పొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేవు. అయినప్పటికీ సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అంటూ వేరువేరుగా ఫీజులు వసూలు చేస్తున్నారనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు పాఠశాల యాజమాన్యం నిబంధనలు పట్టించుకోకుండా దర్జాగా వ్యవహరించడం గమనార్హం.
సీబీఎస్ఈ సిలబస్ అంటూ ప్రచారం..
శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు అసలు అనుమతులు లేనట్లు తెలుస్తోంది. మరొక పాఠశాల అనుమతులతో దీనిని నడిపిస్తున్న ఆ పాఠశాలకు కేవలం స్టేట్ బోర్డు అనుమతులు మాత్రమే ఉన్నాయని సమాచారం. అయినా ఇదంతా పట్టించుకోకుండా సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తామంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. నల్లగొండ పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు ఆకర్షితులై తమ పిల్లలను లక్షల రూపాయలు వెచ్చించి పాఠశాలలో చేర్పిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారాలతో ఆకర్షించి విద్యార్థులను చేర్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
లక్షల్లో ఫీజులు.. పాఠశాల పేరుతో పుస్తకాలు
శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేకున్నప్పటికీ సీబీఎస్ఈ సిలబస్ పేరుతో ఒక్కో తరగతికి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు అదే పాఠశాలలో పుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పాఠశాలలో పుస్తకాలు విక్రయించొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా పాఠశాల పేరును ముద్రించి మరి అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయినా ఇవేమీ మాకు పట్టవన్నట్లు వారి పని వారు చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా జరుగుతున్న అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదో తరగతి విద్యార్థికి సుమారుగా తొమ్మిది వేల వరకు పుస్తకాలకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.






