కోవిడ్ పెరుగుదలపై ఆందోళన వద్దు: ప్రజారోగ్య శాఖ అడ్వైజరీ

by Naga Rani Yarlagadda |

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

కోవిడ్ పెరుగుదలపై ఆందోళన వద్దు: ప్రజారోగ్య శాఖ అడ్వైజరీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం కోవిడ్ కేసుల్లో కనిపిస్తున్న స్వల్ప పెరుగుదల కేవలం సాధారణ రుతుపవనాల (సీజనల్) మార్పు మాత్రమేనని, గత ఏడాది కూడా ఇదే సమయంలో ఇలాంటి ట్రెండే నమోదైందని వెల్లడించింది. ఈ మేరకు ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డా. బి. రవీందర్ నాయక్ శుక్రవారం ప్రత్యేక హెల్త్ అడ్వైజరీ విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఐడీఎస్‌పీ (ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం), ఐసీఎంఆర్, వెల్లూర్ సిఎమ్‌సి వంటి ప్రముఖ నైపుణ్య సంస్థలు ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించాయని డీహెచ్ తెలిపారు. వైరస్ తీవ్రత పెరిగినట్లు గానీ, సరికొత్త ప్రాణాంతక 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్' రూపాంతరం చెందినట్లు గానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లూయెంజా (సీజనల్ ఫ్లూ) సంచరించే సమయం కావడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు రాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కనీస ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, గాలి-వెలుతురు సరిగ్గా లేని ప్రదేశాలకు, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని కోరారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు నిఘా చర్యలు కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నామని డీహెచ్ తెలిపారు.

Next Story