పంచాయతీలు వద్దు.. పరిష్కారమే కావాలి: మునీరాబాద్ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

తుంగభద్ర క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పంచాయతీలు వద్దు.. పరిష్కారమే కావాలి: మునీరాబాద్ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ పనులు దక్షిణ భారతదేశ జలవనరుల చరిత్రలో ఒక అపూర్వ ఘట్టమని, ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కర్ణాటకలోని మునీరాబాద్‌లో జరిగిన తుంగభద్ర నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ పనులు కేవలం ఓ సాంకేతిక విజయం మాత్రమే కాదని, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల కరవు జిల్లాల సమస్యల పరిష్కారానికి పడిన బలమైన అడుగు అని పేర్కొన్నారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల రైతాంగ కష్టాలు, అలాగే తెలంగాణలోని పాలమూరు వలసల గురించిన బాధలు, అక్కడి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యలను సకాలంలో పరిష్కరించుకోకపోవడం వల్లే ఎంతో విలువైన జలాలు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు 10 టీఎంసీల నీరు రావట్లేదు..

అంతరాష్ట్ర జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమకు రాష్ట్రాల మధ్య పంచాయతీలు వద్దని.. కేవలం రైతాంగ శ్రేయస్సు కోసం సమస్యల పరిష్కారమే కావాలన్నారు. మూడు రాష్ట్రాల మధ్య నీటి చర్చలు ఒక కొలిక్కి రావడం శుభపరిణామని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యలకు సైతం ఈ తుంగభద్ర ఒడ్డున జరిగిన చర్చలు త్వరలోనే ఓ శాశ్వత పరిష్కారాన్ని చూపుతాయని నేను బలంగా నమ్ముతున్నానని తెలిపారు. అనంతరం ఆయన రైతుల హక్కుల గురించి మాట్లాడుతూ.. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 10 టీఎంసీల నీరు ఇంకా రావడం లేదనే విషయాన్ని సీఎం ఈ వేదికపై ప్రస్తావించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) కింద ఉన్న తెలంగాణ రైతులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని తాము ఆశిస్తున్నామని, ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు. వివాదాలను పక్కనబెట్టి పరస్పర సహకారంతో ముందుకెళితేనే మూడు రాష్ట్రాల రైతాంగానికి మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story