అలంకారప్రాయంగా ట్రైకార్.. కేటాయింపులు ఘనం, విడుదల శూన్యం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని పెంపొందించడం, గిరిజన సమాజంలో పేదరికాన్ని నిర్మూలించి, వారు స్వయం ఉపాధి పొందేలా చేయడం కోసం ట్రైకార్ (తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్‌ తెగల ఆర్థిక సహకార సంస్థ) పని చేస్తుంది.

అలంకారప్రాయంగా ట్రైకార్.. కేటాయింపులు ఘనం, విడుదల శూన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని పెంపొందించడం, గిరిజన సమాజంలో పేదరికాన్ని నిర్మూలించి, వారు స్వయం ఉపాధి పొందేలా చేయడం కోసం ట్రైకార్ (తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్‌ తెగల ఆర్థిక సహకార సంస్థ) పని చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. గిరిజనులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ట్రైకార్ అసలు లక్ష్యం. కానీ ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. అందుకు కారణం నిధుల రాకపోవడమే. అసెంబ్లీ సాక్షిగా నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించినా.. వాటిని విడుదల చేయడం లేదు. ఫలితంగా గిరిజనులకు ఆశించిన ఆర్థిక సహకారం అందడం లేదు. కాగితాలపైనే వారికి ఆర్థిక సాయం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

5శాతం కూడా రాలే

గత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.2,370 కోట్లతో వార్షిక ప్రణాళికను రూపొందించారు. మొత్తం 1,40,243 మందికి లబ్ధి చేకూర్చాలని ట్రైకార్ లక్ష్యంగా పెట్టుకుంది. వార్షిక ప్రణాళిక, లక్ష్యం బాగానే ఉన్నా.. నిధుల విడుదలలో అసలు సమస్య వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.30 కోట్లు, సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ అమలు కోసం రూ.10 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత ఇతర కార్యక్రమాల అమలు కోసం రూ.30 కోట్లు విడుదల చేయగా.. ఆ నిధులను మేడారం జాతరలో పనుల కోసం మళ్లించారు. ఆ నిధుల ఖర్చులో అసలు ట్రైకార్ ప్రమేయం కూడా లేదు.

ఈ ఏడాది యాక్షన్ ప్లాన్

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,085 కోట్లతో యాక్షన్ ప్లాన్ రూపొందించారు. మొత్తం 5 పథకాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కేవలం రాజీవ్ యువ వికాసం ద్వారా 1,05,584 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు ప్రభుత్వ సబ్సిడీ రూ.1210 కోట్లు, బ్యాంకు రుణాలు రూ.311 కోట్లు మొత్తంగా రూ.1520 కోట్లు కేటాయించాలని ప్రణాళిక రూపొందించారు. క్యూర్ పరిధిలో 7500 మందికి ఎలక్ట్రిక్ వాహనాలు రాయితీపై ఇవ్వడానికి రూ.150 కోట్లు, సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్‌ కింద 100 మందికి లబ్ధి జరిగేలా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. ఇందిర సౌర గిరిజల వికాసం పథకం కింద 10 వేల మందికి సోలార్ పంపు సెట్లను ఇవ్వాలని ట్రైకార్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక 13 వేల మందికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.75 కోట్లు అవసరం అవుతాయని ట్రైకార్ వార్షిక ప్రణాళికలో లెక్కలు వేశారు. ట్రైకార్ లక్ష్యం బాగానే ఉన్నా.. ఈ ఏడాదైనా నిధులు విడుదల అవుతాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

పదేళ్లు గడిచినా

గత ప్రభుత్వ హయాంలో 2016- 17 నుంచి 2023-24 ట్రైకార్ ద్వారా వివిధ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 35,565 మందికి యూనిట్లను అందజేశారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీ కాకుండా బ్యాంకుల నుంచి లబ్ధిదారులు రుణాలు తీసుకున్నారు. వాటిని నెలవారీగా చెల్లిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ ఇంకా అందలేదు. దాదాపు రూ.221 కోట్ల సబ్సిడీ లబ్ధిదారులకు అందాల్సి ఉంది.

కార్పొరేషన్ల పరిస్థితి ఇదే

కేవలం ట్రైకార్ ఒక్కటే కాదు.. రాష్ట్రంలో దాదాపు అన్ని కార్పొరేషన్ల పరిస్థితి ఇలానే ఉంది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీమంత్రి హరీశ్ రావు.. కార్పొరేషన్లకు నిధుల విడుదల విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘21 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాటి అసలు ఉద్దేశాన్ని నీరుగార్చారు. యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్‌, విశ్వబ్రాహ్మణ, మేదర, కుమ్మరి, వాల్మీకి, బోయ తదితర కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల్లో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మొత్తంగా 33 కార్పొరేషన్లకు ఇప్పటివరకు రూ.14,521 కోట్లు కేటాయించగా, విడుదల చేసింది 3,198 కోట్లు. దాంట్లో వినియోగించింది రూ.305 కోట్లు మాత్రమే’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

Next Story