- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతాలకూ పైసల్లేవు.. బకాయిలు చెల్లించండి! సింగరేణి కార్మికుల పోరు బాట
సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన రూ.46 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఇవాళ హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ముందు ధర్నాకు పిలుపునిచ్చాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని, రాష్ట్ర విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన రూ.46 వేల కోట్ల భారీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు పోరాట బాటపట్టాయి. నేడు హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ముందు భారీ ధర్నా నిర్వహించేందుకు సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది.
అప్పుల్లో సింగరేణి.. బకాయిలు చెల్లించని విద్యుత్ సంస్థలు
సింగరేణి సంస్థకు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీజీజెన్ కో) నుంచి సుమారు రూ.27,378 కోట్లు, ఇతర విద్యుత్ సంస్థల నుంచి కలిపి మొత్తం రూ. 46 వేల కోట్లు రావాల్సి ఉంది. ఒకవైపు సంస్థకు రావాల్సిన నిధులు రాక, మరోవైపు కొత్త ప్రాజెక్టులు, బొగ్గు గనుల విస్తరణ కోసం వేల కోట్ల రూపాయల అప్పులు చేయాల్సి వస్తోందని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలనెలా జీతాలు చెల్లించేందుకు సైతం సంస్థ వద్ద డబ్బులు లేక అప్పులు తీసుకురావాల్సి వస్తోందని, దీంతో బకాయిల వసూళ్ల కోసం ధర్నా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
- విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన రూ.46 వేల కోట్లను వెంటనే సింగరేణికి విడుదల చేయాలి.
- సింగరేణికి రావాల్సిన బొగ్గు గనులను వేలం వేయకుండా నేరుగా సంస్థకే కేటాయించాలి.
- సంస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలను ఆపి, కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి.
సింగరేణికి ఒక్క పైసా ఇవ్వడం లేదు
బొగ్గు, కరెంటు సరఫరా చేసినందుకు గాను సింగరేణి సంస్థకు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ టీజీ జెన్ కో, తెలంగాణ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ సుమారు రూ.46వేల కోట్లు బకాయి పడ్డాయి. సింగరేణి ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇచ్చేందుకు సైతం సంస్థ వద్ద పైసా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వెంటనే బాధ్యత తీసుకుని బకాయిలు చెల్లించాలి. బకాయిలు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నుంచి సీఎం-మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ.10 కోట్లు తీసుకోవడం విడ్డూరంగా ఉంది. సింగరేణి పట్ల గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఒకే వైఖరిని అవలంభిస్తున్నాయి.
- మంద నర్సింహారావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు






